త్వరలో అందుబాటులోకి భూ భారతి
భూ సమస్యల పరిష్కారానికే కొత్త చట్టం
ప్రజలకు సేవలందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి
రెవెన్యూ సంఘాల నేతలతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి) : రాష్ట్రంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి భూ భారతిని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తు న్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులు ప్రజలకు ఉత్తమ సేవలందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి నేతృత్వం లో ఆదివారం రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు మంత్రి పొంగులేటిని కలిశారు. గ్రామ స్థాయిలో 10,954 గ్రామస్థాయి పరిపాలన అధికారులు, కొత్త డివిజన్లు, మండలాలకు 361 పోస్టులతో పాటు 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు క్యాబినెట్ ఆమోదం తెలపడంపట్ల ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేసి, మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. ఉద్యోగులకు వేతనాలను నెల మొదటి వారంలోనే చెల్లిస్తున్నట్టు పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడానికే కొత్త పోస్టులను మంజూరు చేసినట్టు మంత్రి స్పష్టం చేశారు.
పొంగులేటిని కలిసిన వారిలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణ, తహసీల్దార్ అసోషియేషన్ అధ్యక్షుడు ఎస్. రాములు, మహిళా అధ్యక్షురాలు రాధ, టీజీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి, సీసీఎల్‌ఏ యూనిట్ అధ్యక్షుడు రాంబాబు తదితరులు ఉన్నారు.






