బీజేపీ నినాదం వెనుక భారీ కుట్ర

10-05-2024 01:03:06 AM

కేంద్రంలో మళ్లీ ఆ పార్టీ వస్తే రిజర్వేషన్లు గోవిందా

రాజ్యాంగాన్ని మార్చడం ఖాయం 

గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలి

ఖనిలో మీడియాతో మంత్రి శ్రీధర్ బాబు

మంథని, మే 9 (విజయక్రాంతి):  ఇస్ బార్ చార్ సౌ అనే బీజేపీ నినాదం వెనుక భారీ కుట్ర దాగి ఉందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆరోపించారు. గురువారం సాయంత్రం గోదావరిఖని రెడ్డి భవన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. కేంద్రంలో మరో మారు బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్లను తొలగించడం ఖాయంగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. బీజేపీ కుట్రలను పసిగట్టి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణను సింగరేణి కార్మికులు, ప్రజలు అధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు. బీజేపీ కుట్రపూరిత ఆలోచనలను ఎండగట్టారు. భారత రాజ్యాంగాన్ని అంగీకరించేది లేదని ఆర్‌ఎస్‌ఎస్ గతంలోనే వ్యతిరేకించిన ఉదంతాన్ని గుర్తుచేశారు. సమానత్వం కోసం రచించిన రాజ్యాంగాన్ని మార్చి రాయడం  వెనుక భారీ కుట్ర దాగి ఉన్నట్టు ఆరోపించారు. దేశ ప్రగతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు గడిచిన పదేళ్లు అద్భుత ఫలితాలను అందించినట్టు చెప్పారు.

కాంగ్రెస్ కృషి ఫలితంగా వచ్చిన క్రెడిట్ ను కూడా బీజేపీ తన ఖాతాలో వేసుకొని విషప్రచారం చేస్తోందని విమర్శించారు.  ఏటా ౨ కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన బీజే పీ పదేళ్లలో 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే కల్పించి యువతను మోసం చేసిందని ధ్వజమెత్తారు. జీఎస్టీతోపాటు నిత్యావసర సరుకు ల ధరలు పెంపు ద్వారా సామాన్యుల నడ్డి విరిచిందని అన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికీ పెట్రో ధరలను భారీగా పెంచి పేద ప్రజలపై ఆర్థిక భారం మోపిందని మండిపడ్డారు. పదేళ్లుగా ప్రజలను లూటీచేసిన బీజేపీకి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

సింగరేణి ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించిన శ్రీధర్‌బాబు  వేలం ప్రక్రియ ద్వారానే సంస్థకు కొత్త బొగ్గు బ్లాకులను సాధించిపెట్టేలా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పదేళ్ల గడీల పాలనను బద్ధలు కొట్టిన కాంగ్రెస్, ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల ద్వారా దేశంలో బందీగా మారిన భారతమాతకు విముక్తిని కల్పించబోతోందని చెప్పారు.

ప్రగతి సాధన కోసం రూ. 250 కోట్ల నిధులను మంజూరు చేయడంతో పాటు రామగుండంలో 800 మెగా వాట్ల పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి, సహకరించిన మంత్రి శ్రీధర్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో మినిమం వేజ్ బోర్డ్ చైర్మన్ జనక్ ప్రసాద్,  కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేశ, కాలువ లింగస్వామి, మహంకాళి స్వామి, తిప్పారపు శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.