ఓట్లు అడిగితే బిచ్చగాళ్లా?

10-05-2024 01:05:25 AM

ఫోన్ ట్యాపింగ్ డబ్బులతో కొంటలేం

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలపై ‘బండి’ ఫైర్

ప్రసాద్ స్కీం కింద నిధులేవని ప్రభుత్వానికి ప్రశ్న

ఓటుకు వెయ్యిచ్చే ప్లాన్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్

సిగ్గు లేకుండా విమర్శిస్తారా అంటూ ఆగ్రహం

ఆ పార్టీలపై నిఘా పెంచాలని ఈసీకి విజ్ఞప్తి

చొప్పదండి/కరీంనగర్, మే 9(విజయక్రాంతి) ః ఓట్లడిగితే బిచ్చగాళ్లా..? అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ మండిపడ్డారు. బీజేపీ నేతలు హిందువుల పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కునే బిచ్చగాళ్ళంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వాఖ్యలపై పట్ల తోకతొక్కిన పాములా బుసలు కొట్టారు. గంగాధర మండలం వెంకటాయపల్లి ఎల్‌కే కన్వెన్షన్‌లో బూత్ ఏజెంట్లకు పోలింగ్ రోజున అనుసరించాల్సిన విధానాలపై బండి సంజయ్ గురువారం అవగాహన కల్పించారు.

అనంతరం పార్టీలో చేరిన పలువురికి బండి కాషాయం కండువాలు కప్పారు. అనంతరం తిమ్మాపూర్ మండలం అలుగునూరులో బూత్ ఏజెంట్లకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ పైసలతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు బీఆర్‌ఎస్ కూడా ప్రయత్నిస్తోందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చాలనే కుట్ర చేస్తున్నారన్నారు. అందుకే ఓటుకు రూ. వెయ్యి ఇచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం, పోలీసులను కోరేది ఒక్కటేననీ, ఫోన్ ట్యాపింగ్ సీరియస్ అంశమన్నారు. బీఆర్‌ఎస్ నేతలపై డేగకన్ను వేయాలని, పూర్తి స్థాయి నిఘా పెట్టాలని కోరారు.

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇవ్వలేదని, ఎంపీగా ఉంటూ బండి సంజయ్ నయాపైసా తేలేదంటూ మంత్రి పొన్నం, బీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్ చేసిన వాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా తీవ్రంగా స్పందించారు. ప్రసాద్ స్కీం కింద ప్రతిపాదనలు పంపితే అప్పటి సీఎం కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న ఆలయాలు అభివృద్ధికి నోచుకోకపోవడానికి ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వమే కారణమన్నారు.

దేవుళ్ళకే శఠగోపం పెట్టిన 420 నేతలు బీఆర్‌ఎసోళ్ళేనని, వాళ్ళకు తగిన శాస్తి జరిగిందన్నారు. అయినా సిగ్గులేని బీఆర్‌ఎస్ అభ్యర్థి తమపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న ఆలయాలను అభివృద్ధి చేయడంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. రాష్ట్రాన్ని పాలించిన ఈ రెండు పార్టీల నిర్వాకంవల్లే ఆలయాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తనను గెలిపిస్తే ఈ రెండు ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెడతానని హామీ ఇచ్చారు.