విద్యార్థి హత్యపై బీహార్‌లో దుమారం
శాంతిభద్రతలు లేనే లేవన్న ఆర్జేడీ, కాంగ్రెస్
నిందితులను వదల బోమన్న ప్రభుత్వం
పాట్నా, మే 28: బీహార్ రాజధాని పాట్నాల్లో ఓ లా కాలేజీ క్యాంపస్‌లోనే విద్యార్థిని దారుణంగా కొట్టిచంపటంపై రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగుతున్నది. నగరంలోని బీఎన్ కాలేజీలో ఇంగ్లిష్ ఒకేషనల్ కోర్సు థర్డ్ ఇయర్ విద్యార్థి హర్ష్‌రాజ్ (22) అనే సుల్తాన్‌గంజ్‌లోని పాట్నా లా కాలేజీలో సోమవారం పరీక్ష రాసి బయటకు వస్తుండగా ముసుగులు ధరించిన వ్యక్తులు కర్రలతో దాడిచేయటంతో తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకొని అతన్ని పాట్నా మెడికల్ కాలేజీకి తరలించేలోపే మరణించాడు. కాలేజీలోనే పట్టపగలు విద్యా ర్థిని కొట్టిచంపటంతో ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
నితీశ్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆర్జేడీ నేత లాలూప్రసాద్, కాంగ్రెస్ నేతలు విమర్శించారు. అయితే, విద్యార్థి మృతికి కారణమైన ఏ ఒక్కరిని వదిలేది లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఈ అంశంపై దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు ప్రధాన నిందితున్ని అరె స్టు చేసినట్టు ప్రకటించారు. గత ఏడాది దసరా రోజు రాత్రి జరిగిన గొడవే ఈ హత్యకు కారణమని వెల్లడించారు. మృతుడితో కలిసి గతంలో తీసుకొన్న ఫొటోను ఎక్స్‌లో షేర్ చేసిన బీహార్ మంత్రి అశోక్ చౌదరి.. నిందితులు ఎంతటివారైనా వదిలేది లేదని స్పష్టంచేశారు.






