27 July, 2026 | 4:46 PM

గూండాలను పంపుతారా?

29-05-2024 12:34 AM

న్యూఢిల్లీ, మే 28: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. ఈ  తీర్పు ఇచ్చిన జడ్జీలపైకి ఆమె గూండాలను పంపిస్తారా అంటూ ప్రశ్నించారు. మంగళవారం పశ్చిమబెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లాలోని అశోక్‌నగర్‌లో మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఓబీసీల నమ్మకాన్ని టీఎంసీ వమ్ము చేసింది. కలకత్తా హైకోర్టు ఈ విషయాన్ని బట్టబయలు చేసింది. 77 ముస్లిం వర్గాలకు ఓబీసీ సర్టిఫికెట్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని కలకత్తా హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. లక్షలాది మంది ఓబీసీ యువకుల హక్కులను టీఎంసీ ప్రభుత్వం లాగేసుకుంది. రాజ్యాంగం ప్రసాదించిన ఓబీసీ రిజర్వేషన్లను రాత్రికి రాత్రే ‘ఓటు జీహాదీ’లకు అప్పజెప్పారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఆమె ప్రభుత్వం తీవ్రంగా అవమానించింది’ అని మోదీ దుయ్యబట్టారు. 

కోర్టు తీర్పులనే ధిక్కరిస్తారా?

‘కోర్టు తీర్పు వచ్చాక టీఎంసీ ముఖ్యమంత్రి దాన్ని వ్యతిరేకించారు. ఆమె అలాంటి వ్యాఖ్యలు చేయడంతో నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆమె కొందరు న్యాయ మూర్తులను ప్రశ్నించారు. ఆఖరికి న్యాయవ్యవస్థను కూడా ఆక్షేపించారు. ఇప్పుడు ఆ న్యాయమూర్తులపైకి గూండాలను పంపిస్తారా? బెంగాల్‌లో న్యాయవ్యవస్థను టీఎంసీ గొంతు నులిమి చంపేస్తోది. నిజం చెబితే టీఎంసీ జీర్ణించుకోలేదు. వారి తప్పులను ఎత్తి చూపిన వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంటుంది’ అని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.