భూస్థాపితం అయ్యేది బీఆర్ఎస్, బీజేపీ కాదు
హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) చేసిన వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు(BJP Chief Ramchander Rao) కౌంటర్ ఇచ్చారు. కవిత పార్టీ స్థాపిస్తే భూస్థాపితం అయ్యేది బీఆర్ఎస్.. బీజేపీ కాదని చెప్పారు. కవిత బీఆర్ఎస్ అనబోయి బీజేపీ అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. కవిత బీఆర్ఎస్ భూస్థాపితం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని(Chhatrapati Shivaji Maharaj Jayanti 2026) పురస్కరించుకుని గురువారం నాడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామచందర్ రావు, ఎంపీ అరవింద్ శివాజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఘన నివాళులర్పించారు. భారతీయ శౌర్య పరాక్రమాలకు, ధర్మ రక్షణకు నిలువుటద్దం శివాజీ మహారాజ్ అన్నారు. ఛత్రపతి ఆశయాలు, సుపరిపాలన, దేశభక్తి మనందరికీ నిరంతర స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
కవిత గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉండవని పేర్కొన్నారు. తను పార్టీ పెట్టాక తెలంగాణలో తాము ప్రధాన ప్రతిపక్షం అవుతామన్నారు. ఎన్నికల్లో గెలిచి వందశాతం అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్త ంచేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వస్తే ఏదో ఒక పార్టీ గుర్తుపై పోటీ చేస్తామని సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు పార్టీ ఏర్పాటు పూర్తియితే తమ పార్టీ గుర్తుపై పోటీ చేస్తామని తెలిపారు. తమ పార్టీలో యువత, కొత్త వారికి పెద్దపీట వేస్తామని సూచించారు. బీఆర్ఎస్ లో ఉన్నవారు చాలామంది తనతో టచ్ లో ఉన్నారని కవిత వివరించారు. ఎవరు టచ్ లో ఉన్నారో సందర్భం వచ్చినప్పుడు చెబుతా అన్నారు.






