ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా బీజేపీ
* కార్యకర్తల నిస్వార్థ త్యాగమే పార్టీ బలగం
* శ్యామా ప్రసాద్ ముఖర్జీ, వాజ్‌పేయి ఆశయాలే స్ఫూర్తి
* బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు
* ఖమ్మం జిల్లాలో వైభవంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవం
ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం అత్యంత వైభవంగా జరిగాయి. పార్టీ ఆవిర్భవించిన చారిత్రాత్మక దినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు జిల్లా పార్టీ కార్యాలయంలో వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రుద్ర ప్రదీప్, సీనియర్ నాయకులు గంట్యాల విద్యాసాగర్, వక్కలంక సుబ్రహ్మణ్యం, మండడపు సుబ్బారావు, అల్లిక అంజయ్య, నకరికంటి వీరభద్రం, లక్ష్మీనారాయణ, రవి గౌడ్, వీరభద్ర ప్రసాద్, ఆర్ వి ఎస్ యాదవ్, దార్ల మల్లేశ్వరి, మణి, వెంకటనారాయణ, రుద్రగాని మాధవ్ తదితరులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు.
జిల్లా కేంద్రంతో పాటు నగరంలోని రోటరీ నగర్, ఖానాపురం, గట్టయ్య సెంటర్, రాపర్తి నగర్, కాల్వొడ్డు మరియు కొనిజర్ల మండలం అనంతారం గ్రామాలలో కూడా పార్టీ జెండాను ఎగురవేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కోట్లాది మంది కార్యకర్తల నిస్వార్థ త్యాగం మరియు అంకితభావం వల్లే బీజేపీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగిందని కొనియాడారు. సామాన్య కార్యకర్తలే బలగంగా, దేశహితమే పరమావధిగా ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం నేడు ప్రపంచ రాజకీయ యవనికపై అగ్రస్థానానికి చేరుకుందని రాంచందర్ రావు గుర్తు చేశారు.
నాడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయి వేసిన పటిష్ట పునాదులపై నేడు పార్టీ అప్రతిహతంగా దూసుకుపోతోందని వారు పేర్కొన్నారు. కేవలం ఎన్నికల విజయం కోసమే కాకుండా సామాజిక మార్పు కోసం, అంత్యోదయ సిద్ధాంతంతో పేదల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని, సామాన్య కార్యకర్తలకు సైతం ఉన్నత పదవులు అందిస్తూ ప్రజాస్వామ్య విలువలకు పెద్దపీట వేస్తోందని వివరించారు. తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి కార్యకర్త ప్రజల గొంతుకగా మారి పోరాడాలని నెల్లూరి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు.
ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో బీజేపీ కార్యకర్తలు ముందుండాలని, సామాన్యులకు భరోసా కల్పించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం నేడు స్వయం సమృద్ధమైన, దృఢమైన దేశంగా మారుతోందని, 2047 నాటికి 'వికసిత్ భారత్' లక్ష్య సాధనలో ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా భాగస్వామి కావాలని దిశానిర్దేశం చేశారు. మహనీయుల ఆశయాలకు అనుగుణంగా పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని, తెలంగాణ రాష్ట్రం ఈ ప్రయాణంలో కీలక పాత్ర పోషించాలని నాయకులు పిలుపునిచ్చారు.




