6 April, 2026 | 9:45 PM

మునుగోడు గురుకులాన్ని రామన్నపేటకు మార్చొద్దు

06-04-2026 07:36 PM

- ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్, జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్

మునుగోడు,(విజయక్రాంతి): మునుగోడు నియోజకవర్గానికి మంజూరైన గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలను రామన్నపేటకు మార్చే ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్, జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి మాట్లాడారు.

28-07-2023న జారీ చేసిన G.O.Ms.No.36 ప్రకారం విద్యాసంస్థ మునుగోడు నియోజకవర్గానికి మంజూరైందని తెలిపారు.2023-24 విద్యా సంవత్సరంలో తాత్కాలికంగా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో ప్రారంభించిన ఈ పాఠశాల ఇప్పటికీ అక్కడే కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రస్తుతం గురుకులంలో 5వ తరగతి నుంచి ఇంటర్ రెండవ సంవత్సరం వరకు సుమారు 400–450 మంది విద్యార్థులు చదువుతున్నారని, వీరిలో 95 శాతం మంది నల్లగొండ జిల్లాకు చెందినవారేనని పేర్కొన్నారు.

ముఖ్యంగా లంబాడా గిరిజన విద్యార్థులు అధికంగా ఉన్నారని చెప్పారు.ప్రస్తుత పాఠశాల నిర్వహణలో పలు సమస్యలు ఉన్నాయని తెలిపారు. సరైన భవనం లేకపోవడం, పాడైన భవనంలో తరగతులు నిర్వహించడం, ఆర్ అండ్ బి శాఖ భవనం అనర్హమని పేర్కొనడం, విద్యార్థుల భద్రతకు ముప్పు ఉండడం వంటి అంశాలను వివరించారు. ఇటీవల ఒక విద్యార్థి గాయపడిన ఘటనను కూడా ప్రస్తావించారు. అదనంగా తాగునీరు, హాస్టల్, పారిశుద్ధ్య వంటి మౌలిక వసతులు కూడా తగినంతగా లేవని చెప్పారు.

ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ విద్యాసంస్థను యాదాద్రి భువనగిరి జిల్లాలోనే కొనసాగించేందుకు, రామన్నపేటలో కొత్త భవనం నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. నల్లగొండ జిల్లాకు చెందిన సంస్థకు టెండర్ ప్రక్రియను యాదాద్రి భువనగిరి జిల్లా నుండి నిర్వహించడం పరిపాలనా పరంగా సరికాదని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల భద్రత, భవిష్యత్తు దృష్ట్యా, అలాగే ఎక్కువ మంది విద్యార్థులు నల్లగొండ జిల్లాకు చెందినవారే కావడంతో, ఈ గిరిజన గురుకులాన్ని మునుగోడు నియోజకవర్గ పరిధిలోనే తక్షణం మార్చి శాశ్వతంగా కొనసాగించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుర్ర సైదా నాయక్ ఉన్నారు.