రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిజెపి శ్రేణులు
- ఢిల్లీలో జరిగిన పరిణామాలకు ఆజ్యం పోస్తున్న కాంగ్రెస్
- బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి
కొత్తగూడెం,(విజయక్రాంతి): ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలకు మరింత ఆజ్యం పోస్తూ, అల్లరి మూకలను రెచ్చగొడుతున్న కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ చర్యలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. బుధవారం బిజెపి జాతీయ పార్టీ పిలుపుమేరకు జరిగిన ఈ కార్యక్రంలో అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో గల అమరవీరుల స్తూపం వద్ద దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి మాట్లాడాతూ... "ఢిల్లీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే శక్తులకు రాహుల్ గాంధీ మద్దతు ఇస్తున్నారని తాము భావిస్తున్నామన్నారు. దేశంలో అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడం కాంగ్రెస్ పార్టీకి కొత్త విషయం కాదని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని వ్యాఖ్యానించారు. "ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించడం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యతని ఆయన స్పష్టం చేశారు.
సమస్యలు ఏమైనా ఉంటే పార్లమెంట్‌లో, చట్టసభల్లో చర్చించి ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు. నిరసనల పేరుతో ఉద్రిక్త పరిస్థితులను సృష్టించడం ఏమాత్రం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. అలాగే, "భారతీయ జనతా పార్టీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ప్రజాస్వామ్యబద్ధంగా దేశానికి సేవ చేస్తోందని వివరించారు. దేశ సమైక్యత, రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని" స్పష్టం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మోర్చాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






