కొల్లమద్ది ఎస్సీ కాలనీ షార్ట్ సర్క్యూట్ బాధితులకు అండగా ఉంటాం: పర్శ హన్మాండ్లు
గంభీరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొల్లమద్ది గ్రామంలోని ఎస్సీ కాలనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ తరపున, అలాగే ప్రభుత్వ పరంగా అండగా నిలుస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పర్శ హన్మాండ్లు తెలిపారు. బుధవారం ఆయన కొల్లమద్ది గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని, వారి సమస్యలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల జరిగిన షార్ట్ సర్క్యూట్ ఘటనలో 71 దళిత కుటుంబాలకు చెందిన గృహోపకరణాలు భారీగా దగ్ధమయ్యాయని తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు 53 మీటర్లు, 12 ఫ్రిడ్జ్‌లు, 50 టీవీలు, 65 ఫ్యాన్లు, 150 బల్బులు, ఒక ల్యాప్‌టాప్, ఒక గీజర్ కాలిపోయి బుగ్గిపాలయ్యాయని పేర్కొన్నారు. మొత్తం నష్టం దాదాపు రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఇంత పెద్ద ఎత్తున నష్టం జరగడం బాధాకరమని అన్నారు. షార్ట్ సర్క్యూట్ జరిగిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోవాల్సి ఉండగా, సుమారు 15 నిమిషాల పాటు కరెంట్ కొనసాగడం ప్రజల్లో భయాందోళనలు కలిగించిందని ఆయన అన్నారు.
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని అనుమానం వ్యక్తం చేశారు.ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను కోరారు. ఈ విషయాన్ని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి ఎన్‌పీడీసీఎల్ అధికారులు మరియు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడినట్లు తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారని చెప్పారు.






