2029 నాటికి 21 రాష్ట్రాల్లో యూసీసీ
- ఉమ్మడి పౌర స్మృతిని ప్రవేశపెట్టనున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు
- ఒక్క చుక్క రక్తం చిందకుండా, ఒక్క బుల్లెట్ దిగకుండా..
- ఆర్టికల్ 370, 35ఏ రద్దు ప్రక్రియ పూర్తి చేశాం
- కేంద్ర హోమంత్రి అమిత్ షా
ముంబై, సెప్టెంబర్ 13: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న 21 రాష్ట్రాల్లో 2029 నాటికి ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ని ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) ఆదివారం తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో కేంద్రం సాధించిన విజయాలు, బీజేపీ 25 ఏళ్ల ప్రస్థానాన్ని వివరిస్తూ ఆయన ముంబైలో మీడియాతో తో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం ‘ట్రిపుల్ తలాక్ రద్దు ద్వారా ముస్లిం మహిళలకు సమాన హక్కులు కల్పించామని, అనేక రాష్ట్రాల్లో ఉమ్మడి పౌర స్మృతిని ప్రవేశపెట్టామన్నారు.
అలాగే ‘బీజేపీ- పాలనలో ఉన్న 21 రాష్ట్రాల్లో 2029 నాటికి యూసీసీని ప్రవేశపెడతామనే నమ్మకం నాకు ఉంది’ అని అమిత్ షా అన్నారు. తదుపరి లోక్సభ ఎన్నికలు 2029లో జరగాల్సి ఉంది. ‘భారతీయ న్యాయ సంహిత’ ద్వారా దేశ నేర న్యాయ వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేసిందని, అనేక రాష్ట్రాల్లో నేరస్తులకు శిక్ష పడే రేటు ఏడాదిలోనే 30 శాతం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. మూడేళ్లలోపు న్యాయం అందేలా చూసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు.
జాతీయ భద్రత విషయానికి వస్తే, ఆర్టికల్ 370, 35ఏ రద్దు ప్రక్రియ ఒక్క చుక్క రక్తం చిందించకుండా లేదా ఒక్క బుల్లెట్ కూడా కాల్చకుండానే పూర్తయిందని, కశ్మీర్ ఇప్పుడు పూర్తిగా భారతదేశంలో విలీనమైందని స్పష్టం చేశారు. ఐదు దశాబ్దాల నక్సలిజానికి ప్రభుత్వం ముగింపు పలికిందన్నారు. 9,000 మందికి పైగా లొంగిపోయారని, ఈశాన్య ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని తెలిపారు. సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులు, ఆపరేషన్ సింధూర్ వంటి చర్యలు ఉగ్రవాదం పట్ల ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని నెలకొల్పాయని ఆయన స్పష్టం చేశారు. తాను ఇటీవల ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ (మత్తుపదార్థాల రహిత భారత్ ఉద్యమం)ను ప్రారంభించానని, ఈ ప్రచారంలో భాగంగా ప్రతి రాష్ట్రాన్ని సందర్శిస్తానని తెలిపారు.