తినే తిండిపై బీజేపీ రాజకీయం
బ్రిక్స్‌లో శాఖాహారాన్ని విదేశీ ప్రముఖులపై రుద్దింది
18వ సదస్సు విందుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్
దేశంలో 80 శాతం మాంసాహారులే..: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: బీజేపీ తినే తిండిని కూడా రాజకీయం చేస్తోందని, బ్రిక్స్(BRICS) విందులో తమ ఆహారపు అలవాట్లను వివిధ దేశాల అధ్యక్షులు, విదేశీ ప్రముఖులపై బీజేపీ రుద్దుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. బ్రిక్స్ సదస్సు సందర్భంగా జరిగిన డిన్నర్‌లో పూర్తిగా శాకాహార వంటకాలను మాత్రమే వడ్డించడాన్ని ఆ పార్టీ తప్పు పడుతూ.. ఆదివారం కాంగ్రెస్ పార్టీ బీజేపీపై విమర్శలు గుప్పించింది.
భారతీయులలో 80 శాతం మంది మాంసాహారులేనని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. శనివారం భారత్ మండపంలో జరిగిన బ్రిక్స్ సదస్సు నాయకులు ప్రతినిధుల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఈ విందును ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియా వేదికలైన ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో గాంధీ పోస్టు చేశారు. ‘ఒక విషయం గుర్తుంచుకోండి. 80 శాతం మంది భారతీయులు మాంసాహారులు. భారతీయ మాంసాహార వంటకాలు చాలా రుచిగా ఉంటాయి.
నా సోదరి చేసే ‘చోలే భటూరే’ కూడా అంతే రుచిగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. అలాగే డైనింగ్ టేబుల్ మీద ఉన్న ‘చోలే భటూరే’ ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశారు. బ్రిక్స్ విందు గురించి గాంధీ నేరుగా ప్రస్తావించనప్పటికీ, కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధినేత పవన్ ఖేరా ఆ విందు మెనూకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘తోటి భారతీయులపై తమ ఆహారపు అలవాట్లను రుద్దే బీజేపీ ధోరణి ఇప్పటికే తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. ఇప్పుడు, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ప్రముఖులపై కూడా తమ సొంత ఎంపికలను రుద్దడం ద్వారా వారు దీనిని మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు’ అని ఆరోపించారు.