31 May, 2026 | 12:08 PM

మిల్లర్ల దోపిడీపై బీజేపీ ఆందోళన

31-05-2026 11:34 AM

తహసీల్దార్ కార్యాలయం ముట్టడి

కోనరావుపేట: రైతుల సమస్యల పరిష్కారం కోసం కోనరావుపేట మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు మిరియాల బాలాజీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జరుగుతున్న అక్రమ వసూళ్లను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మిరియాల్కర్ బాలాజీ మాట్లాడుతూ... ధాన్యం కొనుగోలు సమయంలో మిల్లర్లు రైతులను తీవ్రంగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.

హమాలీ పేరిట రూ.2, లారీ చార్జీల పేరుతో అదనపు వసూళ్లు చేస్తూ రైతులపై ఆర్థిక భారం మోపుతున్నారని విమర్శించారు. ఈ అక్రమ వసూళ్లను వెంటనే నిలిపివేసి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులు లేదా గోదాములకు తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వర్షాల వల్ల ధాన్యం దెబ్బతినే ప్రమాదం ఉన్నందున తక్షణ చర్యలు అవసరమని పేర్కొన్నారు. రైతుల కష్టానికి తగిన గుర్తింపు, గౌరవం లభించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వారికి పూర్తి సహకారం అందించాలని బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేశారు.