2 August, 2026 | 5:04 PM

బోనాలు సజావుగా నిర్వహించాలి: ఏసీపీ వెంకట్ రెడ్డి

02-08-2026 03:44 PM

భక్తుల భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యం

ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఆలయ కమిటీలు, నిర్వాహకులతో సమీక్ష సమావేశం

ఉప్పల్, ఆగస్టు 2 (విజయక్రాంతి): రాబోయే బోనాల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఉప్పల్ ఏసీపీ వెంకట్ రెడ్డి సూచించారు. బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ తరఫున పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.

ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఏసీపీ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, ఆలయ కమిటీ సభ్యులు, ఉత్సవ నిర్వాహకులు పోలీసులతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ రామలింగారెడ్డి మాట్లాడుతూ, బోనాల ఊరేగింపులు నిర్ణీత మార్గాల్లోనే నిర్వహించాలని, శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. యువత మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు. సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు అదనపు సిబ్బందిని విధుల్లో నియమించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ  చిరంజీవి ఆలయ కమిటీ సభ్యులు, బోనాల ఉత్సవ నిర్వాహకులు, కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.