పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదు: భారత్ పెట్రోలియం ప్రకటన
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని భారత్ పెట్రోలియం(Bharat Petroleum) ప్రకటించింది. భయాందోళనలతో ఫిల్లింగ్ స్టేషన్లకు వెళ్లవద్దని భారత్ పెట్రోలియం విజ్ఞప్తి చేసింది. సాధారణ అవసరాలకు అనుగుణంగా ఇంధనం నింపుకోవాలని బీపీసీఎల్ ప్రజలను కోరింది. ఇంధన సరఫరా సక్రమంగా ఉంచేందుకు బీపీసీఎల్ కట్టుబడి ఉందని వెల్లడించింది.
"పెట్రోల్, డీజిల్ కొరత వదంతులు పూర్తిగా నిరాధారమైనవి. భారతదేశంలో పుష్కలమైన ఇంధన నిల్వలు ఉన్నాయి, సరఫరా గొలుసులు సాధారణంగా నడుస్తున్నాయి," అని బీపీసీఎల్ ఎక్స్ పోస్టులో పేర్కొంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఏమాత్రం లేదు. ఇంధన సరఫరాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అలాగే తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని హిందుస్తాన్ పెట్రోలియం (Hindustan Petroleum Corporation Limited ) బుధవారం ప్రకటించింది. మంగళవారం నుండి దేశవ్యాప్తంగా అనేక ఇంధన కేంద్రాల వద్ద తీవ్ర భయాందోళనలకు దారితీసిన వదంతులను ఆ సంస్థ కొట్టివేసింది.




