29 July, 2026 | 10:12 AM

విద్యార్థి ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో లెక్చరర్‌పై ఆరోపణలు

29-07-2026 09:41 AM

ఇంటర్‌లో 98.63 శాతం మార్కులు సాధించిన తరుణ్ మృతితో విషాదం

గద్వాల, జూలై 29: గద్వాల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి(Intermediate second year student) తరుణ్ (18) మంగళవారం తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తరుణ్ గద్వాల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 440 మార్కులకు 434 మార్కులు (98.63 శాతం) సాధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలల విభాగంలో జిల్లా స్థాయిలో రెండో ర్యాంకు పొందినట్లు అతను రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. అదే కళాశాలలో చదువుతున్న మరో విద్యార్థికి 435 మార్కులు రావడంతో, కేవలం ఒక్క మార్కు తేడా ఉన్నప్పటికీ శిరీష అనే లెక్చరర్ తనతో అవమానకరంగా మాట్లాడారని, తనను ప్రోత్సహించాల్సిన ఉపాధ్యాయురాలు తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారని, తనపై చేయి చేసుకున్నారని కూడా సూసైడ్ నోట్‌లో ఆరోపించినట్లు సమాచారం.

ఈ ఆరోపణలపై అధికారికంగా నిర్ధారణ జరగాల్సి ఉంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూసైడ్ నోట్ నిజానిజాలు, అందులో పేర్కొన్న ఆరోపణలు, కళాశాలలో జరిగిన పరిణామాలపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని మృతుడి కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే విద్యార్థులపై ఉపాధ్యాయుల ప్రవర్తన, మానసిక ఒత్తిళ్ల అంశాలను విద్యాశాఖ అధికారులు పరిశీలించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.