బ్రిక్స్ ప్రాతినిథ్యం పెరగాలి
- ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకుల్లో వర్ధమాన దేశాలకు ఓటు హక్కు కల్పించాలి
- ఏకపక్ష నిర్ణయాలు, సుంకాలు ఉండొద్దు
- బ్రిక్స్ ఫోరమ్‌లో ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు(IMF, World Bank)ల్లో వర్ధమాన దేశాలకు ప్రాతినిథ్యం పెరగాలని, ఓటింగ్ కల్పించాలని బ్రిక్స్ పిలుపు ఇచ్చింది. అలాగే ఏకపక్ష నిర్ణయాలు, వాణిజ్య సుంకాలు ఉండొద్దని బ్రిక్స్ ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు తెలిపారు. ఇదే అతిపెద్ద బ్రిక్స్ బిజినెస్ ఫోరం(BRICS Business Forum) అని, బ్రిక్స్ దేశాల ఎగుమతులు 2024 నాటికి 6 ట్రిలియన్ డాలర్లకు పెరిగాయని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. పారదర్శక వాణిజ్య విధానాలు పాటించాలని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్(S. Jaishankar) చెప్పారు.
న్యూఢిల్లీ లో శనివారం నుంచి 13 వరకు జరిగే బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బ్రిక్స్ దేశాల ఆర్థిక, విదేశాల మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నరు మాట్లాడారు. ఉమ్మడి బ్రిక్స్ కరెన్సీని గానీ, ఏకీకృత చెల్లింపుల వ్యవస్థను గానీ ప్రకటించలేదు. కానీ మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు వాణిజ్యం, పెట్టుబడుల కోసం స్థానిక కరెన్సీల వినియోగాన్ని సమర్థించారు. సరిహద్దు చెల్లింపుల వ్యవస్థలపై పనిని ముందుకు తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు మాట్లాడుతూ.. ఏకపక్ష సుంకాలు, వాణిజ్య చర్యలు ప్రపంచ వాణిజ్యాన్ని వక్రీకరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య విభజన, సంరక్షణవాదం, విధాన అనిశ్చితి, అప్పుల భారం వంటి సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు.
డబ్ల్యూటీఓ కేంద్రంగా ఉండే బహిరంగ, పారదర్శక, నియమాల ఆధారిత వాణిజ్య వ్యవస్థ కు మద్దతు పునరుద్ఘాటించారు. వాణిజ్యం, పెట్టుబడుల్లో స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు సరిహద్దు చెల్లింపులను వేగవంతం, చౌకగా మార్చేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. బ్రిక్స్ దేశాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ మరింత కీలక పాత్ర పోషించాలని సూచించారు.
ఇదే అతిపెద్ద బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్
బ్రిక్స్ దేశాల ఎగుమతులు 2003లో సుమారు 900 బిలియన్ డాలర్ల నుంచి 2024 నాటికి 6 ట్రిలియన్ డాలర్లకు పెరిగాయని, ఇది ఆ కూటమి మార్కెట్ పరిధిని, సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రపంచ ఎగుమతుల్లో బ్రిక్స్ దేశాల వాటా దాదాపు రెట్టింపు అయ్యిందని, 24 శాతానికి చేరిందన్నారు. ఇప్పటివరకు జరిగిన వాటిలో ఇదే అతిపెద్ద బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ అన్నారు. ప్రపంచ విలువ గొలుసులపై ప్రభావం చూపే సుంకేతర అడ్డంకులు, వ్యవసాయం వంటి అంశాలను ఈ ఫోరమ్ చర్చించింది అని అన్నారు.
పారదర్శక వాణిజ్య విధానాలు పాటించాలి: జైశంకర్
ప్రపంచ మార్కెట్లలో పెరుగుతున్న అస్థిరతను ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు పారదర్శక, బహిరంగ వాణిజ్య, పెట్టుబడి విధానాలను అవ లంబించాలని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. భౌగోళిక రాజకీయ సంఘర్షణలు, మహమ్మారులు, వాతావరణ మార్పుల కార ణంగా సరఫరా గొలుసులు ఎదుర్కొంటున్న అంతరాయాలను సమష్టిగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఆర్థిక వృద్ధికి మార్కెట్ ప్రాప్యత, నమ్మకమైన లాజిస్టిక్స్, ఊహించదగిన వ్యాపార వాతావరణం, విభిన్న వాణిజ్య సంబంధాలు అవసరమని పేర్కొన్నారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కృత్రిమ మేధస్సు, ఫిన్టెక్, అధునాతన తయారీ రంగాల్లో బ్రిక్స్ దేశాలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. వ్యాపార అవకాశాలు, సవాళ్లపై స్పష్టమైన దృష్టితో బ్రిక్స్ సహకారాన్ని తదుపరి దశకు తీసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.