24 June, 2026 | 1:50 PM

పేపర్ మిల్లు అంశంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది

24-06-2026 12:55 PM

ఏఐసిసి మహిళ జాతీయ కార్యదర్శి అదిత

కుమ్రం భీం అసిఫాబాద్(విజయక్రాంతి): కాగజ్‌నగర్ పేపర్ మిల్లు అంశంపై బీఆర్ఎస్ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఏఐసిసి మహిళ జాతీయ కార్యదర్శి అదిత విమర్శించారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో పేపర్ మిల్లు కార్మికుల సమస్యలను పట్టించుకోని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు సవతి ప్రేమ చూపిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు.పేపర్ మిల్లు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ముఖ్యంగా కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తీసుకున్న చొరవతో కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నారని తెలిపారు.

కార్మికుల పక్షాన నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని బీఆర్ఎస్ నేతలు ఎందుకు చూడలేకపోతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.గతంలో కేసీఆర్, కేటీఆర్‌లపై తీవ్ర విమర్శలు చేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు స్వార్థ రాజకీయాల కోసం బీఆర్ఎస్‌తో కలిసి నడుస్తున్నారని ఆరోపించారు. ఆయన చేస్తున్నవి సిద్ధాంత రాజకీయాలా, స్వార్థ రాజకీయాలా ప్రజలకు స్పష్టం చేయాలని ప్రశ్నించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని అదిత హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.