కాంట్రాక్టర్ల మేలుకే బీఆర్‌ఎస్ నేతలు పనిచేశారు

24-04-2024 02:02:02 AM

l ఓడేడు బ్రిడ్జిపై విచారణ చేపట్టాలని సీఎంను కోరా 

l ఖమ్మంపల్లి వంతెనపై కూడా విచారణ

l ‘కాళేశ్వరం’తో ఆంధ్రా కాంట్రాక్టర్‌కు మేలు  

l మీడియాతో మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్‌బాబు

మంథని, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే అప్పటి బీఆర్‌ఎస్ నాయకులు పనులు చేశారని, నాణ్యత లేకుండ నిర్మించడం వల్లనే పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని ఓడేడు బ్రిడ్జి గ్రైడర్లు కిందపడ్డాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ధ్వజమెత్తారు. మహాముత్తారంలో చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆంధ్రా కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకు వంతెనలను నాణ్యత లేకుండా నిర్మించిందని ఆరోపించారు. ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి మానేరుపై కూడా హైలెవల్ వంతెన నిర్మించాలని కోరామని, నాటి ప్రభుత్వం తమ విన్నపాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు.

నాసిరకం పనులతో నిర్మించిన ఈ వంతెనపై అధికారులకు తాను ఎమ్మెల్యేగా ఫిర్యాదు చేశానని, ముఖ్యమంత్రి రేవెంత్‌రెడ్డికి కూడా ఓడేడు బ్రిడ్జిపై విచారణ చేపట్టాలని ఫిర్యాదు చేశామని తెలిపారు. ఓడేడు బ్రిడ్జి కిందపడే సమయంలో మనుషులు ఉంటే ఎంతటి ప్రమాదం జరిగేదో తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుందని అన్నారు. కాళేశ్వరం బరాజ్ ఫిల్లర్లు కుంగాయని కాగ్రెస్ ఆరోపిస్తే.. గగ్గోలు పెట్టిన మాజీ సీఎం కేసీఆర్ అది కుట్రతో జరిగిందన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు ఓడేడు బ్రిడ్జి గ్రైడర్లను ఎవరు కుట్రతో కిందపడేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నాణ్యత లేకుండా వంతెలను నిర్మించారు కాబట్టే ఇలా కూలిపోతున్నాయని, లక్షల కోట్ల ప్రజా ధనాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నీళ్లపాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.