మార్కెట్‌కు పోటెత్తిన మామిడి
బాట సింగారంలో మార్కెట్ ఎక్కడ చూసిన మామిడి రాశులే..
తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక నలుమూలల నుంచి మామిడి
వ్యాపారులకు, రైతులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు
రంగారెడ్డి, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): మామిడి పండ్ల సీజన్ రానే వచ్చింది. ఎండ కాలం వచ్చిదంటే చాలు మామిడి పండ్లు పేరు టక్కునా గుర్తోస్తాయి. రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతం అబ్దుల్లాపుర్‌మెట్ మండలంలోని బాటా సింగారంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రూట్ మార్కెట్ మామిడి పండ్ల క్రయ, విక్రయాలకు ప్రసిద్ధి. మామిడి సీజన్ ఆరంభం కావడంతో మార్కెట్‌లో ఎక్కడ చూసిన మామిడి రాసులే దర్శనం ఇస్తున్నాయి. గతేడాది ఈ సీజన్‌లో రూ. 239 కోట్లకు పైగా వ్యాపారం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈసారి కొంత దిగుబడి తగ్గే అవకాశం ఉంది.
ఇప్పటివరకు 30 వేల మెట్రిక్ టన్నులు..
బాటా సింగారం మార్కెట్‌లో పదిరోజుల నుంచి సీజన్ వ్యాపారం మొదలైంది. దీంతో ఎక్కడ చూసిన మామిడి రాసులే దర్శనం ఇస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన రైతులు మార్కెట్‌కు వస్తారు. ఇప్పటి వరకు దాదాపుగా 30వేల మెట్రిక్ టన్నుల మామిడి వచ్చినట్లు అధికారులు తెలిపారు. వాతావరణం మంచిగా అనుకూలిస్తే సీజన్ ముగిసేలోగా లక్షకు పైగా మెట్రిక్ టన్నుల వరకు మార్కెట్‌కు మామిడి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ అధికారులు అంచనా వేస్తున్నారు. మామిడి ధర మార్కెట్‌లో బంగినిపల్లి మామిడి పండు టన్నుకు రూ. 50వేల నుంచి రూ. 80వేల వరకు పలుకగా, మేలు రకం హిమాయత్ బాక్స్ 20కిలోలు రూ. 4వేలకు పైగా, బెనిషన్ రూ. 1700నుంచి రూ. 1800వరకు రేటు పలుకోతుంది. మామిడి కాయలతో పాటు మామిడి పండ్లు బాక్స్‌ల చొప్పున విక్రయాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో కిలో మామిడి రూ. 75 నుంచి 100 ధర పలుకుతున్నాయి.
ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు
మార్కెట్లో క్రయ, విక్రయాల కోసం ఎక్కడ ఇబ్బందులు తల్లెత్తకుండా ప్రభుత్వం 19 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. 12ఎకరాల విస్తీర్ణంలో భారీగా షెడ్లను ఏర్పాటు చేశారు. మరో 7ఎకరాలను వాహనాల పార్కింగ్ కోసం కేటాయించింది. మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల లోడ్లతో వచ్చే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు కల్గకుండా వాహనాలు సాఫీగా వెళ్లేందుకు రోడ్లను నిర్మించారు. ప్రతీరోజు ఇక్కడికి 1000వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. మార్కెట్‌కు కొనుగోలు, వ్యాపారం చేసే రైతులు, వ్యాపారాలకు తాగునీటి వసతి సౌకర్యాలు, మామిడిని నిల్వచేసుకొనేందుకు ప్రత్యేక బిడ్డింగ్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడ సమస్యలు వచ్చిన మార్కెట్ సిబ్బందిని అందు బాటులో ఉంచినట్లు మార్కెట్ గ్రేడ్ కార్యదర్శి నర్సింహరెడ్డి తెలిపారు.






