21-01-2025 12:17:19 AM
హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభ పరిస్థితులపై అధ్యయనానికి 9 మంది సభ్యులతో కూడిన కమిటీని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మాజీ వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో కూడిన కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటి ంచి క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖ మంత్రికి, వ్యవసాయ కమిషన్‌కు, బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు నివేదికను అందజేస్తుందని కేటీఆర్ తెలిపారు.
రెండువారాల పాటు విస్తృతంగా పర్యటన అనంతరం రైతు ఆత్మహత్యలకు దారితీస్తున్న ప్రధాన కారణాలతోపాటు రాష్ట్రంలో గత ఏడాది కాలంలో వ్యవసాయ సంక్షోభానికి దారితీసిన పరిస్థితులను పరిశీలించి నివేదికను తయారు చేస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర రైతాంగానికి అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే నాలుగు వందల మందికిపైగా రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్న ఆందోళనకర పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రప్రభుత్వం చెప్పిన రైతు రుణమాఫీ కనీసం 30 శాతం దాటకపోవడం, రైతన్నలకు కొన్నేండ్లుగా అందుతు న్న రైతుబంధును ఆపివేసి.. ఇస్తామన్న 15 వేల రూపాయల రైతు భరోసాన్ని కూడా ఎగొట్టడం.. వంటి ప్రధానమైన ఆర్థిక సమస్యలు రైతు ఆత్మహత్యలకు దారితీస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు.