21 April, 2026 | 3:51 AM

ఢిల్లీకి బీఆర్‌ఎస్ త్రిసభ్య కమిటీ

21-04-2026 02:29 AM
  1. మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో మాజీ ఎంపీ వినోద్‌కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర..
  2. కాళేశ్వరం కమిషన్, ఎమ్మెల్యేల ఫిరాయింపులపై న్యాయనిపుణులతో చర్చ

హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ త్రిసభ్య కమిటీ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రలతో కూడిన ఈ ప్రతినిధుల బృందం, రాబోయే కీలక న్యాయపరమైన పరిణామాల నేపథ్యంలో అత్యవసరంగా ఢిల్లీకి వెళ్లింది.

ప్రత్యేకంగా ఏప్రిల్ 22న తెలంగాణ హైకోర్టు కాళేశ్వరం కమిషన్‌పై తుది తీర్పును వెలువరించనున్న నేపథ్యంలో ఈ పర్యటనకు మరింత ప్రాముఖ్యత ఏర్పడింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై వచ్చిన ఆరోపణలు, కమిషన్ విచారణల తరువాత వెలువడనున్న ఈ తీర్పు బీఆర్‌ఎస్‌కు  రాజకీయంగా కీలకంగా మారనుంది. ఈ పరిస్థితుల్లో ప్రతికూల తీర్పు వచ్చినా వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలపై కమిటీ, సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.

మరోవైపు ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై కూడా బీఆర్‌ఎస్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ కేసులో తదుపరి న్యాయపరమైన కార్యాచరణను ఖరారు చేసే దిశగా కమి టీ కార్యాచరణ చేపట్టనున్నది. ఫిరాయింపుల అంశంపై చట్టపరంగా బలమైన వాదనలు సిద్ధం చేయడం, అవసరమైతే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం వంటి అంశాలపై నిపుణులతో సమగ్రంగా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఢిల్లీలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో సమావేశాలు వ్యూహాత్మకంగా సాగుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే తీసుకోవాల్సిన నిర్ణయాలు, దానికి అనుగుణంగా న్యాయపరమైన అడుగులు ఎలా వేయాలి అన్న దానిపై స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ ఢిల్లీ పర్యటన ద్వారా బీఆర్‌ఎస్ రాబోయే న్యాయపరమైన పోరాటాలకు ముందుగానే సిద్ధమవు తోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాళేశ్వరం కమిషన్ తీర్పు, ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుఈ రెండూ కలిసి తెలంగాణ రాజకీయాలను కీలక మలుపు తిప్పే అవకాశం ఉంది.