60 ఏళ్లుగా జీవనాధారంగా ఉన్న మడిగపై వివాదం
అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని బాధితుడి వేడుకోలు
ఆలేరు,(విజయక్రాంతి): ఆలేరు పట్టణంలోని రంగనాయకుల గుడి ఎదుట ఉన్న 5×5 మడిగ స్థలంపై వివాదం నెలకొంది. తమ కుటుంబం సుమారు 60 ఏళ్లుగా ఈ స్థలంలో హోటల్, చిన్న వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తోందని గణగాని సంపత్ కుమార్ తెలిపారు. తన తాత గణగాని ఐలయ్య సుమారు 60 ఏళ్ల క్రితం అక్కడ హోటల్ నిర్వహించారని, అనంతరం తన తల్లిదండ్రులు గణగాని మల్లేశం, గణగాని లక్ష్మి అదే స్థలంలో చిన్న హోటల్ నిర్వహించారని చెప్పారు.
వారి మరణానంతరం తాను కూడా అక్కడ కిరాణా డబ్బా ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగించానన్నారు. కాలక్రమంలో మడిగ శిథిలావస్థకు చేరి కూలిపోయిందని, అనంతరం కట్టెగుమ్ముల విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి ఆ స్థలాన్ని ఆక్రమించి నీటి సంపు ఏర్పాటు చేసి, బండలు వేసి తన ఆధీనంలోకి తీసుకున్నారని సంపత్ కుమార్ ఆరోపించారు. తమ కుటుంబానికి ఎలాంటి స్థిర, చర ఆస్తులు లేవని, ప్రస్తుతం భార్య, పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటూ చిన్న కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు.
తమ కుటుంబం సుదీర్ఘకాలంగా వినియోగించిన మడిగ స్థలానికి సంబంధించిన పాత రికార్డులు, మున్సిపల్ రికార్డులు, ఇతర ఆధారాలను అధికారులు పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలని కోరారు. స్థలం ఆక్రమణకు గురైనట్లు విచారణలో తేలితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుని, తమ కుటుంబానికి ఉపాధి కోసం స్థలాన్ని తిరిగి అందించాలని విజ్ఞప్తి చేశారు. “మడిగ స్థలం తిరిగి లభిస్తే మునుపటిలాగే చిన్న వ్యాపారం చేసుకుని నా భార్య, పిల్లలను పోషించుకుంటాను. నిరుపేద కుటుంబమైన మాకు అధికారులు న్యాయం చేయాలి” అని గణగాని సంపత్ కుమార్ కోరారు.






