గొంతు నొక్కారు.. చీర లాగారు

12-09-2026 | 04:35am
  1. మహిళా కమిషన్ ఎదుట బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేల కన్నీరు 
  2. పోలీసులు విచక్షణారహితంగా ప్రవర్తించారు 
  3. అసెంబ్లీ భవనం సాక్షిగా అవమాన పరిచారు 
  4. అసెంబ్లీ ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజీ భద్రపరచాలి
  5. 100 గంటలు దాటినా ఎఫ్‌ఐఆర్ లేదు
  6. ఢిల్లీలో ఎన్‌హెచ్‌ఆర్‌ఎసీకి ఎమ్మెల్యేలు సబితా, సునీత ఫిర్యాదు
  7. డీజీపీని నివేదిక కోరతాం: జాతీయ మహిళా కమిషన్   

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గ పాలనపై ప్రజల పక్షాన పోరాడాల్సిన తాము మమ్మిల్ని రక్షించుకునేందుకు, తమ సమస్యను పరిష్కరించుకునేందుకు పోరాడాల్సిన దుస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Former Minister Sabitha Indra Reddy) ఆవేదన వ్యక్తం చేశారు.

అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై ప్రజాప్రతినిధులమని కూడా చూడకుండా నా గొంతు నులమడం, సహచర ఎమ్మెల్యే చీర లాగి అత్యంత అవమానానికి గురిచేశారని కన్నీటిపర్యంతమయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి, పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్‌ఎస్ ఢిల్లీ వేదికగా పోరును ముమ్మరం చేసింది.

మహిళా ప్రజాప్రతినిధులపై పోలీసుల దురుసు ప్రవర్తన, తమను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకోవడం, శాసనసభ్యుల హక్కులకు భంగం కలిగించడంపై బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం శుక్రవారం జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహట్కర్‌ను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

అనంతరం జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతిని కలిసి ఫిర్యాదు చేశారు. మహిళా ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకోవడం, పోలీసుల చేత అవమానించడం, శాసనసభ్యులుగా తమ హక్కులకు విఘాతం కలిగించేలా వ్యవహరించడం వంటి అంశాలను వివరించి చెప్పారు. పోలీసులు చేస్తున్న దాడులపై స్పందించాల్సిన ప్రభుత్వ పెద్దలు మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు.

అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఘటనలకు సంబంధించిన అన్ని సీసీటీవీ ఫుటేజీలను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నేతలు కోరారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తగిన రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు.

పోలీసుల తీరు అవమానకరం..

తెలంగాణలో నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలను దేశం మొత్తం గమ నిస్తోందని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సమావేశాల ప్రారంభ రోజునే అసెంబ్లీలోకి వెళ్లకుండా పోలీసులు నల్లదుస్తులు ధరించడాన్ని కారణంగా చూపి తమను అడ్డుకున్నారని ఆ అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చారు అని ప్రశ్నించారు. అసెంబ్లీ వంటి పవిత్ర ప్రాంగణంలో మహిళా ప్రజాప్రతినిధుల పట్ల ఇలాంటి ఘటన జరగడం అత్యంత దురదృష్టకరమన్నారు.

‘మా మనసులు గాయపడ్డాయి. భారమైన గుండెలతో మాట్లాడుతున్నాం. మహిళలుగా మాకు అవమానం జరిగింది. శాసనసభ్యులుగా మా హక్కులకు భంగం కలిగింది’ అని సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దాడి జరిగి 100 గంటలు దాటినా జరిగిన ఘటనపై కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదని ఆమె ఆరోపించారు. మరోవైపు తమపైనే కేసులు నమోదు చేయడం రాజకీయ నాటకమని విమర్శించారు. 

‘మా సమస్యలపై ఫిర్యాదు చేయాల్సి వచ్చింది’

శాసనసభ్యులపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును పూర్తి వివరాలతో జాతీయ కమిషన్లకు ఫిర్యాదు చేశామని సునీత లక్ష్మారెడ్డి తెలిపారు. ఎన్నో ఒడిదుడుకులు, కష్టనష్టాలను భరించి రాజకీయంగా నిలదొక్కుకున్నామని, ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించాల్సిన తాము ఇప్పుడు తమపై జరిగిన దాడి గురించి మాట్లాడాల్సిన పరిస్థితి రావడం అత్యంత దారుణమని అన్నారు. ‘ప్రజా సమస్యలపై మా గొంతు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. అందుకే మమ్మల్ని అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలో న్యాయం జరగలేదని భావించి ఢిల్లీకి వచ్చాం’ అన్నారు. 

పథకం ప్రకారమే అడ్డుకున్నారు..

ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ను శాసనసభకు రాకుండా పథకం ప్రకారం అడ్డుకు న్నారని మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఆరోపించారు. మహిళా ప్రజాప్రతినిధులపై దాడులు చేయించడం ద్వారా ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలా వ్యవహరించారని అన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై భౌతిక దాడులకు పాల్పడ్డారని, హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ తమపై కేసులు పెట్టారని ఆరోపించారు.తెలంగాణలో ఎమర్జెన్సీ రోజులను తలపించేలా కాంగ్రెస్ ప్రభుత్వ నైజం బయటపడుతోందని విమర్శించారు. మహిళా ప్రజాప్రతినిధులను అడ్డుకునేందుకు పురుష పోలీసులను, పురుష ప్రజాప్రతినిధులను అడ్డుకునేందుకు మహిళా పోలీసులను ఉపయోగించడం శిఖండి రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు.

ప్రశ్నిస్తామని భయపడే..

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలదీస్తారని భయపడే అధికార కుట్రపూరితంగా వ్యవహరించిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ‘ప్రజలంతా రేవంత్రెడ్డిని ఇంటికి పంపించి కేసీఆర్‌ను సీఎంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు’ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఇంటిపై దాడికి ఎమ్మెల్యేలు, విప్లను పంపించి సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయంగా రాక్షస ఆనందం పొందారని ఆరో పించారు. కాంగ్రెస్ పార్టీకి పతనం దగ్గరపడిందని వ్యాఖ్యానించారు.

బీఆర్‌ఎస్ ఎంపీ వద్ది రాజు రవిచంద్ర మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. సీఎం వ్యవహరిస్తున్న తీరుపై సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు లేఖలు రాశామని తెలిపారు. ‘రేవంత్‌రెడ్డి చేస్తున్న దాష్టీకాలను రాహుల్ గాంధీ కట్టడి చేస్తారా లేదా?’ అని ప్రశ్నించారు. ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్ష హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. 

మరిన్ని వార్తలు