ఇద్దరు యువకుల దారుణ హత్య
రంగారెడ్డి, జూన్ 6 (విజయక్రాంతి) : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలోని బట్టర్‌ప్లు సిటీ వెంచర్ విల్లాలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ విషయం గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హత్యకు గురైన ఇద్దరు యువకులను కడ్తాల మండలంలోని గోవిందాయిపల్లి గ్రామానికి చెందిన గుండమోని శివ (25), శేషగారి శివ(27)లుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో గుండమోని శివ గత కొంత కాలంగా హైటెక్ సిటీలో ఓ చికెన్ దుకాణంలో పనిచేస్తుండగా, శేషుగారి శివ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అదే గ్రామానికి చెందిన జలకం రవి, ఆమనగల్లు మండలంలోని జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పల్లె రాజు గౌడ్ ఇద్దరూ కలిసి తన సోదరుడు శివతో పాటు మరొకరిని దారుణంగా హత్య చేసినట్లు మృతుని సోదరుడు కరుణాకర్ పోలిసులకు ఫిర్యాదు చేశాడు.
బట్టర్‌ప్లుసైటీలోని విల్లా నెంబర్ 3/4&5 లో ఈ హత్య జరిగినట్లు పేర్కొన్నాడు. దీంతో సంఘటన స్థలానికి చేరుకొన్న సీఐ శివప్రసాద్.. హత్యకు గురైన గుండమోని శివ, శేషగారి శివల మృతదేహాలు వేర్వేరు గదుల్లో పూర్తి రక్తం మడుగులో పడి ఉండటాన్ని గమనించారు. నిందితులు హత్యకు పదునైన ఆయుధాలను వినియోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం హత్యకు గల పూర్తి ఆధారాలను సేకరించారు. సంఘటన స్థలాన్ని శంషాబాద్ అదనపు డీసీపీ రామ్‌కుమార్, షాద్‌నగర్ ఏసీపీ రంగాస్వామిలు పరిశీలించి హత్యకు సంబంధించిన వివరాలపై విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. హత్యకు గల కారణాలను విచారణ అనంతరం వెల్లడిస్తామని సీఐ పేర్కొన్నారు.
గ్రామంలో విషాదఛాయలు
ఓకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు హత్యకు గురికావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకొన్నాయి. విగత జీవులుగా పడి ఉన్న తమ బిడ్డలను చూసి బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఎదిగిన బిడ్డలు హత్యకు గురికావడాన్ని వారి తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. సంఘటన స్థలం వద్ద వారి రోదనలు మిన్నంటాయి. హత్య జరిగిన విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఘటన స్థలానాకి తరలివచ్చారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ హైద్రాబాద్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు బాధిత కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. తప్పకుండా న్యాయం చేస్తామని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామి ఇవ్వడంతో ధర్నా విరమించారు. కాగా, మృతుల కుటుం బ సభ్యులను కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరామర్శించారు.






