వనస్థలిపురంలో దారుణం
- షాపు ఖాళీ చేయాలంటూ మహిళపై దాడి.. సామగ్రి ధ్వంసం
రూ.15 లక్షల ఆస్తినష్టం..రోడ్డున పడ్డ కుటుంబం
షాపు యజమానిపై కేసు నమోదు
ఎల్బీనగర్, జూన్ 6 : ఫుట్‌వేర్ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న మహిళపై షెటర్ యజమాని దాడి చేసిన ఘటన వనస్థలిపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధి లోని వైదేహినగర్‌లో శివ సింధు పాఠశాల ఎదురుగా నాలుగేళ్లుగా పుష్ప అనే మహిళ సాయితేజ ఫుట్‌వేర్ షాపు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో దుకాణాన్ని ఖాళీ చేయాలని షాపు యజమాని హుకూం జారీ చేశాడు. ఆగస్టులో ఖాళీ చేస్తానని పుష్ప చెప్పినా వినకుండా 15 నుంచి 20 మందితో వచ్చి పుష్ప, ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేశాడు.
ఈ ఘటనపై పుష్ప తన కుటుంబ సభ్యులతో కలిసి వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో యజమాని ఆగ్రహంతో పుష్ప దుకాణంలోని సామగ్రిని బయట వేసి, ధ్వంసం చేసి, షెటర్‌కు తాళం వేశాడు. పోలీసులు సకాలంలో స్పందిస్తే తనకు న్యాయం జరిగేదని, ఇప్పుడు తన కుటు ంబం రోడ్డున పడిందని పుష్ప వాపోయింది. ఆగస్టులో షాపు ఖాళీ చేస్తానని చెప్పినా వినకుండా తనపై షాపు యజమాని దాడి చేశాడని తెలిపింది. షాపులోని సామగ్రిని బయట వేసి, నగదు, సెల్‌ఫోన్లును తీసుకున్నారని ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదుతో వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.






