4 September, 2026 | 7:05 AM

నేను దోస్తీకి గులామ్‌ను!

04-09-2026 | 05:55am
  1. బెదిరిస్తే భయపడను 
  2. ఓల్డ్ సిటీ కాదు.. ‘ఒరిజినల్ సిటీ’
  3. ఓవైసీ సోదరులు నిజమైన దేశభక్తులు
  4. సంతోష్‌నగర్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

సిటీబ్యూరో/మలక్‌పేట్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): తాను రాజకీయంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని, బెదిరింపులకు లొంగే ప్రసక్తేలేదని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టంచేశారు. ‘నేను కేవలం దోస్తీకే గులాం. స్నేహం కోసం ఏదైనా చేస్తా’ అని పేర్కొంటూ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(MP Asaduddin Owaisi)తో తనకున్న ప్రత్యేక బంధాన్ని ఆయన ప్రస్తావించారు.

నల్లగొండ చౌరస్తా మార్గంలో రూ. 620 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యంత పొడవైన స్టీల్ బ్రిడ్జిని గురువారం సీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం చంచల్‌గూడ డిగ్రీ కాలేజ్ మైదా నంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు గుజరాత్ నేతలకు గులాంలుగా మారారని మండిపడ్డారు.

గుజరాత్, ఢిల్లీ, యూపీలలో రివర్ ఫ్రంట్లను ఏర్పాటుచేసి నదులను ఆధునీకరిస్తే అడ్డుచెప్పని ఈ నేతలు, హైదరాబా ద్‌లో ‘మూసీ రివర్ ఫ్రంట్’ అభివృద్ధిపై పిల్‌లు వేస్తూ కుట్రపూరితంగా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో పదేళ్ల పాటు లక్ష కోట్లు దోచుకున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నాలుగు శతాబ్దాల ఘనమైన చరిత్ర ఉన్న హైదరాబాద్‌ను ‘ఓల్డ్ సిటీ’ అని పిలవడం సరికాదని, అది నిజానికి ఈ నగరానికి జీవగర్ర అయిన ‘ఒరిజినల్ సిటీ’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 

నిజాం రాజుల కాలంలోనే..

కుతుబ్ షాహీ, నిజాం రాజుల పాలనలోనే హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని సీఎం అన్నారు. ఈసీ, మూసీ నదులపై ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నిర్మించి నగరవాసులకు తాగునీరు అందించిన ఘనత వారిదేనని కొనియాడారు. చార్మినార్ పరిసర ప్రాంతాలైన లాడ్ బజార్, కబూతర్ ఖానా, చుడిబజార్ వంటి ప్రాంతాల్లో బంగారం నుంచి కబూతర్ల వరకు విక్రయించే అద్భుతమైన మార్కెట్ వ్యవస్థను ఆనాడే నిర్మించారని గుర్తుచేశారు.

పాత నగరంలో రవాణా వ్యవస్థను ఆధునీకరించేందుకు త్వరలోనే మెట్రో పనులను ప్రారంభించనున్నట్లు సీఎం వెల్లడించారు. అంతేకాకుండా, చంచల్‌గుడా జూనియర్, డిగ్రీ కాలేజీలతో పాటు స్కూల్లో పెండింగ్ పనుల పూర్తికి రూ. 25 కోట్లు, మీరాలం ట్యాంక్ సుందరీకరణ పనులకు రూ. 500 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు పాత నగర అభివృద్ధికి ఏ ప్రతిపాదనలు తెచ్చినా వెంటనే ఆమోదిస్తున్నామని తెలిపారు.  

ఓవైసీ సోదరులు నిజమైన దేశభక్తులు..

ఎంఐఎం నేతలపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఓవైసీ సోదరులు నిజమైన దేశభక్తులు, ఇందులో ఎలాంటి సందేహం లేదు‘ అని వ్యాఖ్యానించారు. దేశభక్తి విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలకు ఓవైసీ సోదరులు ఏమాత్రం తక్కువ కాదన్నారు. రాజకీయ అభిప్రాయాలు భిన్నంగా ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాల విషయంలో వారు ముందుంటారని, ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన తీరును గుర్తుచేశారు.

ఎంపీ ఓవైసీలాగే తాను కూడా మరో 25 సంవత్సరాల పాటు రాజకీయాధికారంలో కొనసాగుతానని ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్, ఎమ్మెల్యేలు అహ్మద్ బలాలా, నవీన్ యాదవ్, జాఫర్ హుస్సేన్ మిరాజ్, ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.