27 July, 2026 | 1:18 PM

వరి కొయ్యలకు నిప్పు పర్యావరణానికి ముప్పు

30-05-2026 06:53 PM

- జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట,(విజయక్రాంతి): రైతులు వరి పంట కోసిన తర్వాత పొలంలో ఉన్న వరి కొయ్యలకు పెట్టిన నిప్పు పర్యావరణానికి ముప్పనీ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. శనివారం సూర్యాపేట మండలం కాసారాబాద్ గ్రామంలో ఎస్పీ నరసింహతో కలిసి వరి కొయ్యలను తగలబెట్టొద్దని  రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరికొయ్యలు తగలబెడితే భూమి సారవంతం కోల్పోతుందన్నారు. అనంతరం దుక్కి దున్నినప్పటికీ గుల్లగా మారదని, దీనివల్ల పంట దిగుబడి తగ్గుతుందన్నారు.

సాంద్రత పెంచుకునేందుకు అధిక ఎరువులు వాడాల్సి వస్తుందని ఆ భారం కూడా రైతుల పైన పడుతుందని తెలిపారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యంతో పాటు, రహదారులపై వెళ్లే వాహనదారులకు కూడా ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. వరి కొయ్యల వల్ల పక్కన ఉన్న చెట్లు, ఇతర విలువైన వస్తువులు పరికరాలు తగలబడే అవకాశం ఉందని, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రైతులు ఎట్టి పరిస్థితులలో వరి కోయ్యలను తగలబెట్ట వద్దన్నారు.  తదుపరి జిల్లా ఎస్పీ కె.నరసింహ మాట్లాడుతూ ఎవరైనా వరి కొయ్యలు తగలబెట్టడం వల్ల ప్రమాదాల సంభవిస్తే అందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.