భాగ్యనగరానికి గణనాథుని శోభ

14-09-2026 | 05:35am

వాడవాడల్లో కొలువుదీరనున్న గణనాథుడు 

ఆరువేల కోట్ల వరకు వ్యాపారం అని అంచనా 

పండుగ వేళ జోరు అందుకున్న వ్యాపారం

పలువురికి ఉపాధి

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): మహా నగరంలో వినాయక చవితి(Vinayaka Chaturthi) ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభతో పాటు ఆర్థిక వ్యవస్థకు బలమైన ఊపునిస్తున్నాయి. భాగ్యనగరం వ్యాప్తంగా జిహెచ్ఎంసి, సైబరాబాద్, రాచకొండ, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ల పరిధిలో సుమారు రూ.50 వేలకు పైగా భారీ పందిళ్లు ఏర్పాటు కాగా, ఈ 11 రోజుల వేడుకల ద్వారా హైదరాబాద్లోనే ఏకంగా రూ.6,000 కోట్లకు పైగా ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నట్లు అంచనా వేస్తున్నారు. భక్తి నిండిన ఈ ఉత్సవాలు నగరంలో లక్షలాది మందికి తాత్కాలిక, స్థిర ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఆర్థిక చక్రానికి చక్రబంధం వేస్తున్నాయి. 

ఉపాధికి పండుగ ‘సిరి’

ఏయే రంగాలు.... కళకళలాడుతున్నాయంటే?... ధూల్పేట్ సహా నగరంలోని వివి ధ ప్రాంతాల్లో తయారయ్యే విగ్రహాల ద్వారా రూ. వందల కోట్ల బిజినెస్ జరుగుతోంది. మట్టి, రంగులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇనుము పనులపై ఆధారపడే శిల్పులు, కార్మికులకు భారీగా డిమాండ్ పెరిగింది. ఐరన్ ఫ్రేమ్లు, శామియానాలు, డెకరేటివ్ లైటింగ్, సౌండ్ సిస్టమ్స్ వ్యాపారులకు ఈ సీజన్ కనక వర్షం కురిపిస్తోంది.

ప్రసాదాల తయారీ, రోజువారీ పూజలకు కావలసిన పువ్వులు, పండ్లు, కొబ్బరికాయలు, పూజా దినుసుల విక్రయాలు నగరంలో ఊహించని రీతిలో పుంజుకున్నాయి. విగ్రహాల తరలింపు (ఆగమనం) నుండి నిమజ్జనం వరకు వేలాది లారీలు, లగేజీ వాహనాలు, భారీ క్రేన్ల రంగానికి ఊహించని డిమాండ్ ఏర్పడింది. 11 రోజుల పాటు ప్రతి మండపం వద్ద ప్రసాద వితరణ, అన్నదానాలు, కేటరింగ్ కాంట్రాక్టులు స్థానిక వ్యాపారులకు భారీగా ఆదా యాన్ని తెచ్చిపెడుతున్నాయి.

రూల్స్ పాటిస్తూ... ఉత్సవాల ఊపు పెంచుతూ....

పోలీస్ శాఖ, జీహెచ్‌ఎంసి నిబంధనలకు అనుగుణంగా ప్రశాంత వాతావరణంలో సాగుతున్న ఈ నవరాత్రులు కేవలం ఆధ్యాత్మిక సంబరంగానే కాకుండా, చిన్నతరహా వ్యాపారులు, వీధి వ్యాపా రులు, కార్మికులు మరియు కళాకారుల జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపుతున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.


మరిన్ని వార్తలు