ఆవాలు అమ్మమ్మ.. క్యాబేజీ నా పెద్దమ్మ.. బ్రోకోలీ నా చిన్నమ్మ..
ఏంటీ కూరగాయలకు మనుషులలాగా ఈ సంబంధాలు అని ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం అంటున్నారు. తెలుగు వారు పోపు సామానుల్లో విరివిగా వాడే ఆవాలు, క్యాబేజీ, బ్రోకలీ, బ్రస్సెల్స్ మొలకలు బ్రాసికేసి అని ఒకే మొక్కల కుటుంబానికి చెందినవి. సాధారణంగా ఆవాలు లేదా క్యాబేజీ బ్రాసికేసి కుటుంబం అని పిలుస్తారు. ఈ మేరకు ఫ్యామిలీలోని రుచుల వైవిధ్యం వెనుక వేలాది సంవత్సరాలుగా హంటర్స్ గ్యాదరర్స్ కాలం నుంచి ఆధునిక కాలం రైతుల వరకు పరిణామ క్రమంలో చేసిన సెలెక్టివ్ బ్రీడింగ్ కారణమని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీహెచ్ డీ చేసి ప్రస్తుతం జీపీఆర్ఎంఎస్ లో బోధనారంగంలో ఉన్న శాస్త్రవేత్త ఎమ్ వాసవి చెబుతున్నారు. ఒక రకంగా మానవ పరిణామ క్రమం, అడవి ఆవాలు తదితర మొక్కలను డొమెస్టికేట్ చేసుకుని తన కిచెన్ గార్డెన్లో.. వంట ఆవాలుగా తదనంతరం క్యాబేజీ, బ్రోకలీ, బ్రస్సెల్స్ మొలకలుగా మార్చుకోవడం సమాంతరంగా జరిగిన విషయమని పేర్కొన్నారు.
అడవి ఆముదం... వంట ఆముదం
దీనికి మరో ఉదహారణగా అడవి ఆముదం... వంట ఆముదం చెట్టు గా మారడాన్ని చూడొచ్చు. పరిణామ క్రమంలో భాగంగా క్యాబేజీ (బ్రాసికా ఒలేరాసియా) మొక్క పెద్ద పెద్ద వృత్తాకారంగా తిరిగిన ఆకులు, కాంపాక్ట్ గా..కాన్వొల్యూటెడ్ ఆకులుగా పరిణామం చెందడాన్ని బోటనీ శాస్త్రవేత్తలు లాబొరేటరీలలో నిశితంగా పరీశీలించి నిర్ధారించారు. వ్యవసాయానికి ముందు కాలంలో అడవులలో సైతం ఆంథ్రోపాలజీలో సేవేజ్ గార్డెన్ దశగా పేర్కొనే ఆదిమ కాలంలో రైతులు ఆవాలు, ఆముదం తదితర మొక్కలలో తమకు కావాల్సిన లక్షణాలతో జాగ్రత్తగా ఎంపిక చేసుకుని కూరగాయల సాగు చేసేవారు. ఈ క్రమంలోనే ఆధునిక వ్యవసాయ పద్ధతులను వంట బట్టించుకుని ఆధునిక రైతుగా అవతరించి మొక్కల పెంపకం అంటు కట్టడం, గ్రాఫ్టింగ్, హైబ్రిడ్ మొక్కల జాతిని ఆవిష్కరించడం పూర్వ కాలం నుంచి జరుగుతుందన్నారు. రోజు మనం చూసే విస్తృత శ్రేణి కూరగాయల రకాల వెనుక ఘనమైన వ్యవసాయ చరిత్ర ఉందని వివరిస్తున్నారు.






