చంద్రబాబు హామీలకు క్యాబినెట్ ఆమోదం
- ఏపీ భూహక్కు చట్టం రద్దు
జూలై 1 నుంచి పింఛన్ పెంపు
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు
ఆరు శాఖలపై శ్వేతపత్రాలు విడుదల
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి) : సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం ఏపీ మంత్రి వర్గ సమావేశం కొనసాగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సీఎం చంద్రబాబు చేసిన 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రిమండలి నిర్ణయాలను రాష్ట్ర పౌర సంబంధాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి కే పార్థసారథి మీడియాకు వివరించారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం లభించింది. గత ప్రభుత్వం 6,100 టీచర్ పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చిందని మంత్రి గుర్తు చేశారు. ఏపీ భూహక్కు చట్టం 2022( యాక్టు 27ఆఫ్ 2023) రద్దు చేస్తున్నట్లు తెలిపారు. నీతి అయోగ్ ప్రతిపాదించిన చట్టానికి, గత ప్రభుత్వం ఆమోదించిన చట్టానికి తీవ్ర వైరుధ్యం ఉండడంతో రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, ఒంటరి మహిళల, డప్పు కళాకారులు తదితర పింఛన్ల మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నిర్ణయంతో 66 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు. జులై 1న సచివాలయ ఉద్యోగులతో ఇంటి వద్దనే పింఛన్ అందించనున్నారు. దివ్యాంగుల పింఛన్ రూ.3 వేల నుంచి రూ.5 వేలకు, పూర్తి అంగవైకల్యంతో ఉన్న దివ్యాంగులకు పింఛన్ రూ.5 వేలను రూ.15 వేలకు పెంచడం జరిగిందన్నారు.
నైపుణ్య సెన్సెస్ 2024కు, అన్న క్యాంటీన్ల నిర్వహణకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. విజయవాడలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పునర్నామకరణం చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఏపీ అడ్వకేట్ జనరల్‌గా దమ్ములపాటి శ్రీనివాస్ నియామకానికి సైతం మంత్రిమండలి అంగీకారం తెలిపినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ విధానాలపై శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు అవగాహన కల్పించానున్నామని మంత్రి పార్థసారథి వెల్లడించారు.






