కులగణనకు దేశవ్యాప్తంగా పర్యటిస్తా
- రాహుల్‌గాంధీ ప్రధాని అయితేనే బడుగులకు న్యాయం
- పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు
హైదరాబాద్, జూన్ 24 ( విజయక్రాంతి): బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే రాహుల్‌గాంధీ ప్రధాని అయితేనే సాధ్యమవుతుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు అన్నారు. కులగణనపై పార్లమెంట్‌లో బిల్లు పెట్టించాలని రాహుల్‌గాంధీకి తాను లేఖ రాస్తే తప్పకుండా పోరాటం చేస్తానని స్పందించి సమాధానం ఇచ్చారని తెలిపారు. గాంధీభవన్‌లో పార్టీ నేతలు కోదండరెడ్డి, అన్వేశ్‌రెడ్డితో కలిసి సోమవారం మీడియాతో మాట్లాడారు.
కులగణన కోసం త్వరలోనే తెలంగాణ, ఏపీతో పాటు దేశవ్యాప్తంగా తిరుగుతానని, బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని వీహెచ్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల న్యాయమైన డిమాండ్లకు ప్రతి ఒక్కరి మద్దతు ఉందన్నారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ తానుంటానని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో చెంచుల గూడేనికి మంగళవారం వెళతానని, వారికి జరిగిన అన్యాయంపై వాస్తవాలు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లుతానని వీహెచ్ తెలిపారు. రైతు రుణమాఫీ చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి వీహెచ్ అభినందనలు తెలిపారు.
కేటీఆరే కోతల మాస్టర్: కోదండరెడ్డి
రైతులకు పంట రుణాలను మాఫీ చేయడం కేసీఆర్, కేటీర్‌కు ఇష్టం లేదని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి విమర్శించారు. రైతుల విషయంలో రూ.2 లక్షల రుణమాఫీతో మంచి నిర్ణయం తీసుకుంటే బీఆర్‌ఎస్ నాయకులకు మింగుడుపడటం లేదని, కేటీఆర్ కోతల మాస్టర్‌గా, కోతిలా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి రైతు రుణమాఫీ చేయడం చారిత్రక నిర్ణయమన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 18 లక్షల ఎకరాల భూమిని పార్ట్ బీలో పెట్టారని, ధరణి పోర్టల్ వల్ల లక్షలాది కుటుంబాలు బజారున పడ్డాయన్నారు. కేసీఆర్ నిజమైన సన్నకారు, చిన్నకారు రైతులకు రైతుబంధు ఇవ్వలేదని విమర్శించారు.






