17 July, 2026 | 12:03 AM

వివక్ష లేని విద్యా విధానమే లక్ష్యం

17-07-2026 12:03 AM

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సచివాలయంలో ‘రోహిత్ వేముల చట్టం’ ముసాయిదాపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం

నివేదికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం

హాజరైన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్, పొన్నం 

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): ఉన్నత విద్యాసంస్థల్లో వివక్షకు శాశ్వతంగా అడ్డుకట్ట వేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రోహిత్ వేముల తెలంగాణ (ఉన్నత విద్యలో గుర్తిం పు ఆధారిత వివక్ష నివారణ) బిల్లు, 2026 రూపకల్పనపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ తొలి కీలక సమావేశం గురువారం సచివాలయంలో డిప్యూటీ సీఎం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. విద్యాసంస్థల్లో వివక్ష లేని ప్రశాంత వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం చట్టాన్ని అత్యంత పటిష్టంగా రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. బిల్లు డ్రాఫ్టింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులతో కమిటీ  ఏర్పాటు చేయాలని చెప్పారు. కొత్త చట్టానికి సంబంధించిన సమగ్ర విధివిధానాలతో కూడిన ప్రాథమిక ముసాయిదా నివేదికను సిద్ధం చేయాల్సిందిగా సంబంధిత శాఖ సెక్రటరీని ఆదేశించారు.

కర్ణాటకలో ఇప్పటికే ఇటువంటి చట్టం కోసం జరుగుతున్న ముసాయిదా ప్రయత్నాలను పరిశీలించి, అక్కడి ఉత్తమ పద్ధతులను స్వీకరించాలని సూచించారు. ఈ చట్టం రూపకల్పనలో ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తామని, ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామని ప్రకటించారు. వివిధ రాజకీయ పక్షాల నేతలు, ప్రజా సంఘాలు, స్టూడెంట్ అసోసియేషన్ల నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానిస్తున్నామని.. ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి బిల్లులో తుది మార్పులు ఉంటాయని స్పష్టం చేశారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, క్యాబినెట్ సబ్-కమిటీ ఆమోదం పొందిన అనంతరం ఈ చారిత్రాత్మక బిల్లును త్వరలోనే అసెంబ్లీ ముందుకు తీసుకువస్తామని భట్టి వెల్లడించారు.