17 July, 2026 | 12:04 AM

ఇష్టారీతిగా షెడ్ల నిర్మాణం

17-07-2026 12:00 AM
  1. పార్టీ నాయకుడి అండతో రెచ్చిపోతున్న అక్రమార్కులు
  2. మొద్దునిద్రలో నిజాంపేట్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగం
  3. ప్రమాదాలు జరిగినప్పుడే అధికారులు స్పందిస్తారా...
  4. గతంలో ప్రగతి నగర్ ఫర్నిచర్ షాపులలో వరుస అగ్ని ప్రమాదాలు
  5. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ షెడ్లు, స్విమ్మింగ్ పూల్‌పై చర్యలేవీ..?

కుత్బుల్లాపూర్, జులై 16(విజయక్రాంతి): నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని మాకెవ్వడు అడ్డు అనేలా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఓ పార్టీ నాయకుడి అండతో ఇ ష్టం వచ్చినట్టుగా షెడ్లు నిర్మించి కిరాయిలకు ఇస్తూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు.

బాచుపల్లి చౌరస్తా నుండి మియాపూర్ వెళ్లే రహదారిలో ఎలాంటి అనుమతులు లేకుండా, కనీసం ఫైర్ సేఫ్టీ లేకుండా నిర్మించిన అక్రమ షెడ్ల వలన ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఫిర్యాదులు ఎన్ని వస్తున్నా కూడా అధికారులలో చలనం లేదు.అనుకోకుండా ప్రమాదాలు జరిగినప్పుడే అధికారులు స్పందిస్తారా... అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ నాయకుడి అండ... రెచ్చిపోతున్న అక్రమార్కులు

అయితే ఈ అక్రమ షెడ్ల వ్యాపారం వెనుక ఓ పార్టీ నాయకుడి అండ ఉందంటూ ఆరోపణలు ఉన్నాయి. అందుకే అక్రమార్కులు తమ ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోతున్నారని... అధికారులను సైతం మామూళ్ళ తో సర్దుకుపొమ్మన్నారని విశ్వసనీయ సమాచారం.రాష్ట్ర ప్రభుత్వం అక్రమ నిర్మాణాలపై కొరడా ఘులిపిస్తుంటే కొందరు నాయకులు మాత్రం అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్రమ నిర్మాణాలకు ప్రాణం పోస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.అక్రమాలను కాపాడాల్సిన అధికారులు కూడా ఇలా అక్రమార్కులకు గులాం అవ్వడం ఏంటని స్థానికులు విమర్శిస్తున్నారు.

గెలాక్సీ స్విమ్మింగ్ పూల్, అక్రమ షెడ్ల పై చర్యలేవి..?

బాచుపల్లి చౌరస్తా లోని నిర్మించిన షెడ్లు, అలాగే రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మించిన అక్రమ స్విమ్మింగ్ పూల్ పై వరుస ఫిర్యాదులు వస్తున్న అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.ఫైర్ సేఫ్టీ లేకుండా,కనీసం సెట్ బ్యాక్స్ లేకుండా నిర్మించిన అక్రమ నిర్మాణాలపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో అధికారులు అమ్యామ్యాల రుచికి అలవాటు పడి అక్రమాలను ప్రోత్సహిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది.ఫిర్యాదులు వచ్చినప్పుడు ఏదో అలా తూ తూ మంత్రంగా నోటీసులు జారీ చేసి, పై పై కూల్చివేతలు చేపట్టడం అక్రమార్కులతో భేరం కుదుర్చుకోవడానికే అని సర్వత్రా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.

గతంలో ప్రగతి నగర్ ఫర్నిచర్ షాపులలో వరుస అగ్నిప్రమాదాలు

గతం లో గండిమైసమ్మ నుండి మియాపూర్ వెళ్లే రహదారిలో ప్రగతి నగర్ దగ్గర ఫర్నిచర్ షాపులలో వరుసగా అగ్ని ప్రమాదాలు సంభవించాయి. కనీసం ఫైర్ సేఫ్టీ లేకపోవడం,షాట్ సర్క్యూట్ కారణంగా ఇరుక్కిరికుగా ఉండడం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాదం జరగడం వలన భారీ మొత్తంలో నష్టం జరిగింది. అక్రమార్కులు ఇలా చట్టానికి వ్యతిరేకంగా షెడ్లు నిర్మించి మధ్యతరగతి వారికి కిరాయిలకు ఇస్తూ వారిని ప్రమాదంలో పెడుతున్నారు.అనుకోకుండా ఏదైనా అగ్నిప్రమాదం జరిగి, నష్టం జరిగితే బాధ్యత ఎవరిదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడే అధికారులు స్పందిస్తారా... అని స్థానికులలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మొద్దు నిద్రలో టౌన్ ప్లానింగ్ విభాగం

బాచుపల్లి చౌరస్తాలో అక్రమ షెడ్లపై వరుస కథనాలు వస్తున్నప్పటికి టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.కనీసం ఫైర్ సేఫ్టీ లేకుండా నిర్మిస్తున్న షెడ్ల పై ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు జారీ చెయ్యలేదు.అధికారులకు సదరు నిర్మాణదారుడికి చీకటి ఒప్పందం కుదరడంతో అటువైపు కన్నెత్తి చూడడం లేదు అనే ఆరోపణలు స్థానికుల నుండి వెలువెత్తుతున్న అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులే వాటికి వంత పాడుతూ అందినకాడికి దండుకుంటున్నారని ఆరోపణలున్నాయి.ఇలా చెప్పుకుంటూ పోతే సర్కిల్ పరిధిలోని అక్రమాలు మరెన్నో అయిన అధికారుల తీరు మారదు అంటూ స్థానికులు పెదవి విరుస్తున్నారు. అంతే కాకుండా అధికారులపై ప్రజలకు నమ్మకం రోజురోజుకి సన్నగిళ్ళుతుంది. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి అక్రమ షెడ్ల పై చర్యలు తీసుకుంటారా... లేక అక్రమార్కులను ప్రోత్సహిస్తారా అనేది చూడాలి.