గ్రీన్ కు వచ్చేది రూ.18 కోట్లే
మిగిలిన డబ్బు ఎవరికంటే?
అందరూ ఊహించినట్టుగానే ఐపీఎల్ మినీ వేలం(IPL mini auction)లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్(Cameron Green)పై కాసుల వర్షం కురిసింది. అతని కోసం పలు ఫ్రాంచైజీలు నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డాయి. ఆల్ రౌండర్ గా మ్యాచ్ ను శాసించే టాలెంట్ ఉండడంతో కొనుగోలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. వేలంలో కోల్ కత్తా నైట్ రైడర్స్ గ్రీన్ ను రూ.25.20 కోట్లకు దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ మినీ వేలం చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. మనీ పర్స్ ఎక్కువగా ఉన్న కోల్ కత్తా నైట్ రైడర్స్ , చెన్నై సూపర్ కింగ్స్ మధ్యనే ప్రధాన పోటీ జరిగింది. ఇద్దరూ గ్రీన్ కోసం గట్టిగానే ట్రై చేయడంతో బిడ్డింగ్ ధర పెరుగుతూ పోయింది.
మొదటి నుంచీ కూడా కోల్ కత్తా ఈ ఆసీస్ ఆల్ రౌండర్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోవడంతో వేలంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. చివరికి కేకేఆర్(KKR)తో పోటీపడలేక చెన్నై వెనక్కి తగ్గడంతో గ్రీన్ కోల్ కత్తాకే దక్కాడు. కాగా మినీ వేలంలో గ్రీన్ సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. మిచెల్ స్టార్క్ రికార్డును బ్రేక్ చేస్తూ అత్యధిక ధర పలికిన ఫారిన్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. గతంలో స్టార్క్ 24.75 కోట్లకు అమ్ముడైతే.. ఇప్పుడు గ్రీన్ అంతకంటే ఎక్కువగా 25.20 కోట్ల ధర పలికాడు. అలాగే ఓవరాల్‌గా ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక ధర పలికిన మూడో ప్లేయర్‌గా గ్రీన్ నిలిచాడు.
ఈ జాబితాలో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్(Rishabh Pant) 27 కోట్లతో అగ్రస్ధానంలో ఉంటే... శ్రేయస్ అయ్యర్ 26.75 కోట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే కామెరూన్ గ్రీన్, ఐపీఎల్ 2026 వేలంలో 25.20 కోట్ల ధర పలికినప్పటకీ అతనికి 18 కోట్ల రూపాయలే వస్తాయి. ఎందుకంటే ఐపీఎల్ నిబంధనల ప్రకారం విదేశీ ఆటగాళ్ళకు అత్యధికంగా రూ.18 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తం ఐపీఎల్ వెల్ఫేర్‌కి వెళ్తుంది. 2023లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన గ్రీన్ ఇప్పటి వరకూ 29 మ్యాచ్ లలో 707 పరుగులు చేశాడు, దీనిలో ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలున్నాయి. అయితే గాయం కారణంగా గత సీజన్ లో ఆడలేదు. గాయం నుంచి కోలుకున్న తర్వాత షార్ట్ ఫార్మాట్ లో అదరగొడుతున్నాడు.




