బాహ్య మూల్యాంకనం రద్దు చేయాలి...
ఆలేరు, అక్టోబర్ 1 (విజయక్రాంతి): 6, 9 తరగతులకు నిర్వహించనున్న SA-1 బాహ్య మూల్యాంకనాన్ని వెంటనే రద్దు చేయాలని స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్(School Assistant Association) (SAA) రాష్ట్ర అధ్యక్షుడు పసుపులేటి నరేంద్రస్వామి డిమాండ్ చేశారు. బాహ్య మూల్యాంకనాన్ని వ్యతిరేకిస్తూ గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న విరామ సమయంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా నరేంద్రస్వామి మాట్లాడుతూ.. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో అన్ని ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తర్వాత మళ్లీ ప్రయోగాలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. పైలట్ ప్రాజెక్టు నిర్వహించాలంటే ముందుగా ఒక మండలంలో అమలు చేసి, దాని ఫలితాలను పరిశీలించిన తర్వాత విస్తరించాల్సి ఉంటుందని అన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు.
ఇతర దేశాల్లోని విధానాలను మన విద్యా పరిస్థితులకు అన్వయించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఏ తరగతికీ SA-1 బాహ్య మూల్యాంకనం అవసరం లేదని, ఈ విధానం ప్రభుత్వ పాఠశాలలను మరింత ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం ఉందని అన్నారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని గతంలో మాదిరిగానే SA-1 మూల్యాంకనం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు దాసరి మంజుల, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.