3 May, 2026 | 2:51 PM

శాంతి వెలుగుల కాన్వాస్

03-06-2024 12:05 AM

ఓ...ప్రియమైన పాలస్తీనా ప్రేమికుడా...

ప్రతి ఉదయం నీ కంటి ఆకాశంలో ప్రతిబింబించే

నీ ఇంటి సూర్యబింబాల జాడలేవీ..

సామ్రాజ్యవాద శతఘ్నుల ధూళి వాటిని

కమ్మేసిందా...? కప్పేసిందా...?


గాయపడిన నీ హృదయాన్ని నిమిరి

ఓదార్పుగా నీ చెంపలపై నా పెదవులనానిస్తే

నీ చెంపల్లో ఇంకిన కన్నీటి సంద్రాలని చూసినవి

నా కళ్ళల్లో ఎండిన సంద్రాలు 

గురుతొచ్చినవి అయినా....

భూమిమీది సముద్రాల నీటి రుచంతా ఒక్కటే గదా!


ఓ...పాలస్తీనా ప్రేమికుడా...

మీ బుడ్డోడి నిండు మోముపై

నీ బుడ్డదాని నెలవంక నవ్వులపై

మసి పూసిందెవ్వడు?

మన్ను పోసిందెవ్వడు??


అగో...అగో... అక్కడ చూడు

మీ బుడ్డదాని కిష్టమైన తెల్లపావురం

మీ బుడ్డోడి కిష్టమైన రంగురంగుల సీసాల బుడ్లు

వాళ్ళతోపాటుగా సమాధి చేయబడ్డాయి.


పాలస్తీనా ప్రేమికుడా.... ఇటురా..

ఈ కుంచె పట్టుకో...

పగిలిన రంగు సీసాలలో మిగిలిన రంగులతోటి

మశిబారిన ఆకాశం మీద తెల్ల పావురాన్ని గీద్దాం 

పావురాయి విప్పిన రెక్కల నడుమ 

లేలేత ఉషోదయాన్ని చిత్రిద్దాం జమిలిగా.....

శాంతి వెలుగుల కాన్వాసు నిర్మిద్దాం!!


దిలీప్.వి

సెల్: 8464030808