కవిలోక భోజుడు బుద్ధారెడ్డి
గన్నమరాజు గిరిజా మనోహర బాబు
మన ఘనమైన చరిత్రను గానం చేస్తున్న కవులు
చోడవంశము, గోనవంశము
గాఢమగు నాసక్తితో
జనరంజనమ్మే జీవనమ్ముగ
రాజ్యపాలన చేయుచున్ (యాదగిరి)
అని పాడుకుంటూ వచ్చారు. అయితే, మన పాలకుల్లో అనేకులు కేవలం పాలన వరకే పరిమితం కాకుండా పలుకులమ్మ సేవలో కూడా తరించి పలు మహా గ్రంథాలకు శ్రీకారం చుట్టారు. అటువంటి పాలకులలో ఒకరైన గోన బుద్ధారెడ్డి గోన వంశానికి చెందిన రాజు. గోన వంశంలో ప్రసిద్ధుడైన గోన గన్నారెడ్డి పుత్రుడు గోన విట్ఠలుని కుమారుడే ఈ గోన బుద్ధారెడ్డి.
తండ్రి కోర్కె మేరకు ‘రామకథ’
గోన వంశపు రాజులు కాకతీయులకు సామంతరాజులు. వర్ధమానపురం (నంది వడ్డెమాను) కేంద్రంగా రాయచూరు, ఆదవాని మొదలైన ప్రాంతాలను అన్నింటికీ సమర్థమైన పాలనను అందించిన వారు. రాయచూరు శాసనం, బూదపుర శాసనం వంటి అనేక ప్రమాణాలతో చరిత్రకారులు ఈ గోన వంశపు రాజుల చరిత్రను వివరిస్తూ వచ్చారు. గోన బుద్ధారెడ్డి తన తండ్రియైన గోన విట్ఠల్‌రెడ్డి కోరికను తీర్చే క్రమంలో తాను రామాయణాన్ని రచించినట్లు తెలుపుకున్నాడు.
“భూమి గవీంద్రులు బుధులును మెచ్చ
రామాయణంబు పురాణ మార్గంబు
తప్పక నాపేర దగ నంధ్రభాష
జెప్పి ప్రఖ్యాతంబు సేయింపు ముర్వి”
అన్న జనకుని మాటలను మన్నించి గోన బుద్ధారెడ్డి ‘రామాయణ’ రచనను సాగించాడు. ఈ రామాయణమే తెలుగులో ‘తొలి రామాయణమై’ నిలిచింది. ఈయనకు పూర్వం తిక్కన కవీంద్రుడు ‘నిర్వచనోత్తర రామాయణము’ పేర ఉత్తర రామాయణ కథను రచించాడు. గోన బుద్ధారెడ్డి కుమారులైన కాచ, విట్ఠలులు ‘ఉత్తర రామాయణము’ రచించారు. దానిని పూర్వ రామాయణ కవి, తమ తండ్రి గారైన గోన బుద్ధారెడ్డికి అంకితమిచ్చారు. ఆయన తండ్రి కోసం వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండ వరకు రామాయణం రచించి తండ్రికి అంకితంగా ఇస్తే, ఈయన కుమారులు ఇద్దరూ కలిసి ‘ఉత్తర రామాయణం’ రచించి వారి తండ్రి అయిన బుద్ధారెడ్డికి అంకితం ఇవ్వడం ఒక విశేషం.
రాగరమ్యంగా ‘రంగనాథ రామాయణం’
1294 1300 మధ్య కాలంలో రచింపబడిన గోన బుద్ధారెడ్డి ‘రామాయణాని’కి సంబంధించిన విశేషాలను అనేకమంది సాహిత్య చరిత్రకారులు తెలిపారు. ఈ రామాయణము ‘రంగనాథ రామాయణము’గా లోకంలో ప్రసిద్ధి చెందింది. ఈ విషయం గురించి కూడా సాహిత్య చరిత్రకారులు అనేక పరిశోధనలు చేశారు. ఆయన తండ్రిగారైన విట్ఠలరెడ్డిగారి పేరు ‘గోన విట్ఠల రంగనాథరెడ్డి’ అని, ఆ పేరులోని రంగనాథుని పేరనే ‘రామాయణం’ ప్రాచుర్యం పొందిందనీ వారు నిర్ధారించారు. అనేకులైన జానపదులు తమ కళా ప్రదర్శనల్లో ఇందులోని ద్విపదలే విస్తృతంగా ఉపయోగించుకొన్నారు. రంగనాథుడనే ప్రయోక్త పేర ఇది ‘రంగనాథ రామాయణం’గా వాసికెక్కిందని మరికొందరు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.
వేరే కవులు ఎందుకు?
‘కర్తృత్వం’ విషయంపై ఎన్ని భిన్నాభిప్రాయాలు వున్నా, రచనలోని ఆశ్వాసాంత గద్యనుబట్టి ‘రంగనాథ రామాయణం’ గోన బుద్ధారెడ్డి రచనయేనని స్పష్టంగా తెలుస్తున్నది. పైగా ‘అవతారిక’లో తమ తండ్రియైన విట్ఠలుడు తమ సభలో కొలువు దీరి వున్న సభాసదులను ‘రామాయణ రచన చేసే కవులు ఎవరైనా వున్నారేమో’నని ప్రశ్నిస్తే, వారందరూ ఏకకంఠంతో
“కవి సార్వ భౌముడు, కవి కల్పతరువు
కవి లోక భోజుండు, కవి పురందరుడు...
బుద్ధ భూవిభుడు
ఉన్నాడు కదా! వేరే కవులు ఎందుకు?” అని పలకడం ఆయన ప్రతిభకు కొలమానం. అప్పుడు తన తండ్రి కోరికను మన్నించి తాను ఈ రామాయణాన్ని ఏ విధంగా రాయగలడో కూడా సెలవిచ్చాడు.
“పదములర్థంబులు భావ ముల్గతులు,
పదశయ్యలర్థ సౌభాగ్య ముల్యతులు,
రసముల కల్పనల్ప్రాస సంగతులు,
నసమాన రీతుల నన్నియు గలుగ
నాది కవీశ్వరుడైన వాల్మీకి
యాదరంబున బుణ్యులందరు మెచ్చ
జెప్పిన తెఱగున శ్రీరామచరిత
మొప్ప జెప్పెద..”
అని స్పష్టంగా చెప్పాడు. ఈ మాటలు గోన బుద్ధారెడ్డి రచనాశక్తికి తార్కాణాలు.
వారసుల ‘ఉత్తర రామాయణం’
పాల్కురికి సోమనాథుడు ‘ద్విపద’కు గొప్ప కావ్య గౌరవం కలిగించాడు. ఆయన శైవ పారమ్యంతో రచనలు చేస్తే అదే ద్విపదను గ్రహించి శ్రీమన్నారాయణుని పూర్ణావతారమైన శ్రీరామచంద్రుని కథను గోన బుద్ధారెడ్డి ఒక ప్రత్యేక రామాయణంగా అందించాడు. ఆయన వారసత్వం కలిగిన కాచ, విట్ఠలులు అదే ద్విపదలో ‘ఉత్తర రామాయణ’ కథను రచించారు. తండ్రి కుమారులు వాల్మీకి రచించిన రామకథను అత్యంత మధురంగా పాడుకోవడానికి అనువైన ఛందస్సులో అందించి తరించారు. వాల్మీకి రామాయణాన్ని ‘పాద్యేగేయేచ మధురం’ అంటారు. సరిగ్గా బుద్ధారెడ్డి రామాయణం కూడా ప్రజలు సులువుగా పాడుకునే మార్గాన్ని వేసిన కవి బుద్ధారెడ్డి. అందుకే, ఈ రచనను గ్రహించి జానపద కళాకారులు, తోలు బొమ్మలవాళ్లు, యక్షగాన కళాకారులు తమతమ ప్రదర్శనల్లో ‘రంగనాథ రామాయణాన్నే’ ఎక్కువగా ఉపయోగించుకున్నారు. అంటే, ద్విపద ఛందస్సు జనం నోళ్లలో నిత్యం నర్తించే విషయం సత్యమేనన్న మాట.
సామాన్యుల నోట రామగానంగా!
గోన బుద్ధారెడ్డి ‘రంగనాథ రామాయణ’ రచనలో వాల్మీకంలో లేని ఎన్నో అంశాలు చోటు చేసుకున్నాయి. ఇవి పలు పాటల రూపంలో సమాజంలోని సామాన్యుని నోటకూడా వర్ధిల్లుతూనే వచ్చాయి. లక్ష్మణ దేవర నవ్వు, ఊర్మిళ నిద్ర వంటి ఎన్నో పాటలకు మూలం ఈ రామాయణమే అన్నది పలువురు సాహితీ వేత్తల అభిప్రాయం. ఈ కవి కేవలం వాల్మీకి రామాయణం నుండేగాక అనేక కథాంశాలను, ఆధ్యాత్మ రామాయణం, ఆనంద రామాయణం వంటి గ్రంథాల నుండి కూడా స్వీకరించి రచించాడు. ‘పద్మ పురాణం’లోని కొన్ని కథాంశాలూ ఇందులో కనిపిస్తాయి. వీటితోపాటు ప్రజల్లోని కథలు కూడా ఈ కావ్యంలో చోటు చేసుకున్నాయి. లక్ష్మణ రేఖ వృత్తాంతం, ఉడుతా సాయం, సతీ సులోచన కథ వంటి ఇందులోని కథలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
ప్రజాకథలకు రచనలో చోటు
శ్రీరామచంద్రుడు అవతార పురుషుడు. అయితే, ఆ అవతార రహస్యం వాల్మీకంలో ధ్వని పూర్వకంగా చెప్పబడింది. చివర్లో బ్రహ్మదేవుడు చెప్పిన రామచంద్రుడు మాత్రం ‘ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం’ అని ఎంతో స్పష్టంగా చెప్పాడు. ఇతర రామాయణాల్లో ఈ విషయం సూటిగానే వెల్లడింపబడింది. అదే మార్గాన్ని బుద్ధారెడ్డి కూడా అనుసరించాడు. వ్యాచ్యం చేసే ఈయన ప్రయత్నానికి అనేక సందర్భాలు ఇందులో కనిపిస్తాయి. విశ్వామిత్ర మహర్షి రాముణ్ణి తన వెంట తీసుకొని వెళ్లడానికి వచ్చినప్పుడు, రాముని వదల లేని దశరథుడు భయపడుతున్నప్పుడు మునీశ్వరుడు
‘అనఘ! రాముడు బాలుడను బుద్ధిమాను
మనఘ! నీ పుత్రకుండని లోభముడుగు
క్రతుకర్త, క్రతుమూర్తి, క్రతుభోక్త
యతడు లోకారాధ్యుడు..”
అన్నాడు. అంతేకాదు, మరొక సందర్భంలో
“నీవు వామనుడవై నెగడి త్రివిక్ర
మావతారము దాల్చినట్టి విష్ణుడవు..”
అన్న విషయాన్ని గమనిస్తే, బుద్ధారెడ్డి పూర్తిగా ఇతర రామాయణాలను అనుసరించినట్లు అర్థమవుతున్నది.
అదే విధంగా రాముని బాల్యక్రీడలను వర్ణించి ‘మంధర’కు సంబంధించిన కథను జత చేశాడు. అహల్యా వృత్తాంతంలో కూడా వాల్మీకి, ‘ఇంద్రుడు కోడివలె కూత కూస్తే’, ఇతర రామాయణాల్లో ‘కోడిగా మారి కూసినట్లు’ రచించడం కూడా బుద్ధారెడ్డి అనుసరించాడు. దాదాపు ఇతర రామాయణాల ప్రభావంతోపాటు ప్రజా బాహుళ్యంలోని కథలనుకూడా చేర్చడం ఈ రామాయణానికి ఎంతో శోభనిచ్చింది.
గోన బుద్ధారెడ్డి రచన సుదీర్ఘ సమాస రహితమై, అలతి అలతి తెలుగు పదాల పోహళింపుతో వెలిగి, సామాన్య సాహిత్య పాఠకులని కూడా అలరించింది. ఆయన రచనలోని లయాత్మకత పఠితలను సమ్మోహ పరిచే రీతిలో ఉంటుంది. ఒక విధంగా ఈ సల్లక్షణాలతోపాటు మూలకథ భిన్న గాథాకల్పన కూడా దీని ప్రశస్తికి ఒక కారణమని సాహితీవేత్తలు భావించారు. ఇందులోని విపుల వర్ణనలు, అలంకారాలు సాహితీప్రియులను మరింత ఆహ్లాదపరుస్తాయి.
బంగారు కొండకు రత్నాల నిచ్చెన
సుప్రసిద్ధ సాహితీవేత్త కీ.శే. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ‘గంభీర భావయుతమైన రచన, కవిత్రయ రచన తరువాత పేర్కొనదగిన రచన’గా గుర్తించారు. పింగళి లక్ష్మీకాంతం, కట్టమంచి రామలింగారెడ్డి, ఆరుద్ర, ఎస్.వి.రామారావు, సుంకిరెడ్డి నారాయణరెడ్డి వంటి సాహిత్యచరిత్రకారులు ఈ రామాయణం గురించి, ఈ కవిని గురించి అనేక విశేషాలను తమ సాహిత్య చరిత్రలలో వివరించారు. ఆరుద్ర వారన్నట్లు, ఈ కవి రామకథకు చేసిన సేవ ‘ఉడతా భక్తి’ మాత్రమేకాదు, ‘కొండంత సేవ. బంగారు కొండకు వేసిన రత్నాల నిచ్చెన ఈ కావ్యం’ అన్నది అక్షర సత్యం. అందుకే, ఈ రచన ప్రతులు కేవలం ఆంధ్రదేశంలోనేగాక ఫ్రాన్స్, ఇంగ్లండ్ వంటి విదేశాలలో కూడా లభ్యమౌవుతున్నాయి. గోన బుద్ధారెడ్డి వారి‘రంగనాథ రామాయణం’ గొప్పతనం, ఘనమైన ప్రాశస్త్యాలకు ఇంతకంటే నిదర్శనం మరేముంటుంది!
వ్యాసకర్త సెల్: 9949013448






