వన్యప్రానిని వేటాడిన వ్యక్తిపై కేసు నమోదు
సిరికొండ, మార్చ్ 24 (విజయ క్రాంతి): నిజామాబాద్ రూరల్ సిరికొండ మండల పరిధిలోని నారాయణపల్లి గ్రామంలో వన్యప్రాణి పంది మాంసం కలిగి ఉన్న వ్యక్తిని అటవీ శాఖ అధికారులు సోమవారం పట్టుకుని అతనిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎఫ్ ఆర్ వో నర్సింగరావు వెల్లడించారు. వన్యప్రాణులను వేటాడటం నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
అదేవిధంగా కమ్మర్పల్లి రేంజ్ పరిధిలో పెద్దపులి సంచారం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ సూచించింది. సాయంత్రం, రాత్రి, ఉదయం వేళల్లో అడవుల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా ఒంటరిగా అడవికి వెళ్లవద్దని సూచించారు.
పొలాల వద్ద లేదా అడవి పరిసర ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంట్ తీగలు ఏర్పాటు చేయకూడదని, ఇది చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. గ్రామస్తులు తమ పశువులను సురక్షిత ప్రదేశాల్లో ఉంచుకోవాలని, అడవి జంతువుల సంరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు.పులి వంటి వన్యప్రాణులను రక్షించడం మన బాధ్యత,సమాజం బాధ్యత అని, వాటి సంరక్షణకు సహకరించాలని పిలుపునిచ్చారు.




