26 June, 2026 | 2:33 AM

నగదు రాక.. బాధలు తీరక..!

26-06-2026 01:29 AM
  1. రెండు నెలలుగా రైతుకు అందని ధాన్యం పైసలు
  2. అయోమయంలో అన్నదాతలు
  3. ఈ సీజన్ లో పెట్టుబడికి తప్పని అవస్థలు
  4. ధాన్యం నగదు వెంటనే అందించాలని పలువురు రైతుల వేడుకోలు

తుంగతుర్తి, జూన్ 25 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన భాగంగా, రైతులకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంతో ఒక ప్రక్క ఐకెపి కేంద్రాలు, మరొక పక్క సొసైటీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి, సకాలంలో డబ్బులు అందించి రైతులకు లబ్ధి చేకూరాలని లక్ష్యంతో కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేశారు. ధాన్యం రైతు కొనుగోలు కేంద్రాల్లో పోసిన నాటి నుండి నేటి వరకు అనేక విధాలుగా కష్టపడి కాంటాలు పెట్టి, లారీలలో లోడ్ చేసి, మిల్లులో దిగుమతి చేశారు. నెల లు గడిచిన ధాన్యం నగదు రాకపోవడంతో రైతులు అనేక బాధలు పడుతున్నారు.

 ఈ సీజన్ పెట్టుబడికి అందని నగదు

మండలం లో మొత్తం 17 ఐకెపి కేంద్రాలు, 11 సహకార సొసైటీల ద్వారా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ధాన్యం అమ్మకాలు చేశారు. దీనిలో 17 ఐకెపి కేంద్రాల ద్వారా 2,60,780 క్వింటాల ధాన్యా న్ని సుమారు 3785 మంది రైతుల ద్వారా మిల్లులలో కొనుగోలు చేశారు. తుంగతుర్తి రైతు సేవ సహకార సొసైటీ 11 సెంటర్ల ద్వారా సుమారు, 3000 మంది రైతుల గాను, 500 రైతుల పైచిలుకు ధాన్యం బిల్లుల కోసం మిల్లుల చుట్టూ తిరుగుతున్నామని, సొసైటీ అధికారి పేర్కొన్నారు.

ఐకెపి సెంటర్ల ద్వారా ప్రస్తుతం 3000 మందికి రైతులకు ధాన్యం అమ్మకాలపై డబ్బులు అందించినట్లు ఐకెపి ఎపిఎం యాదమ్మ తెలిపారు. 785 మంది రైతులకు, నెల రోజులు గడిచినప్పటికీ, నేటికి నగదు అందలేదని, అకౌంట్లో బిల్లులు పడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం సీజన్ స్టార్ట్ అయినప్పటికీ, ఒక ప్రక్క విత్తనాలు మరొక ప్రక్క యూరియా, డిఏపి అవసరాలు ఉండగా, సమయానికి ప్రభుత్వం డబ్బులు పంపిణీ చేయలేదని, మాకు అప్పు కూడా పుడుతలేదని వివిధ గ్రామాల రైతులు ఆవేదన చెందుతున్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి, సంబంధిత ఐకెపి సొసైటీ యాజమాన్యాలతో మాట్లాడి బిల్లులు వేగవంతంగా చేసి డబ్బులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు, మేధావులు, వివిధ పార్టీ నాయకులు కోరుతున్నారు.

 రెండు నెలలు గడుస్తున్న బిల్లులు రాలే.. 

రైతు సేవ సహకార సొసైటీ ద్వారా సెంటర్ లో ధాన్యం పోసి అమ్మకం చేసి, రెండు నెలలు గడుస్తున్న నేటి వరకు కూడా నాకు డబ్బులు రాలేదు. దీనితో విత్తనాలు ,యూరియా కొనాలంటే ఇబ్బందికరంగా ఉంది. తక్షణమే అధికారులు స్పందించి, ధాన్యం బిల్లు వచ్చే విధంగా చూడాలి.

 సైదులు, రైతు, గొట్టిపర్తి. 

 రైతులకు నగదును త్వరగా ఇప్పించేందుకు కృషి చేస్తున్నాం

ప్రస్తుతం ఈ సీజన్లో 2,60,000 785 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశాము. సుమారు 3785 మంది రైతులకు గాను 3000 రైతులకు బిల్లుల చెల్లింపులు జరిగాయి. ఇంకా సుమారు 785 మంది రైతులకు నగదు రావాల్సి ఉంది. ఈ చెల్లింపులకు అవసరమైన అన్ని పనులను సిబ్బందితో ఆన్ లైన్ లో ఇప్పటికే పూర్తి చేయించాం. నగదును తొందరగా ఇప్పించేందుకు కృషి చేస్తున్నాము. 

 యాదమ్మ, ఏపిఎం, తుంగతుర్తి