26 June, 2026 | 1:42 AM

అంతంలేని అవినీతి!

26-06-2026 12:59 AM

మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఆయన కుటుంబంపై మరకలు

దేశవ్యాప్తంగా చర్చను రేకెత్తించిన వివాదం

* మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2028 సింహస్థ కుంభమేళాకు సిద్ధమవుతున్న తరుణంలో.. ఉజ్జయినిలో పట్టణీకరణను వేగవంతం చేసి న సమయంలో.. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ కుటుంబం ఉజ్జయిని పరిసర ప్రాంతాలలో భారీగా భూములు కొనుగో లు చేసినట్లు ఒక పరిశోధనాత్మక నివేదిక వెలువడటంతో రాజకీయ దుమారం రేగింది.

భూ రికార్డుల ప్రకారం.. కొనుగోలుదారుల జాబితాలో ముఖ్యమంత్రి యాదవ్ భార్య సీమా యాదవ్, కోడలు శాలిని యాదవ్, సోదరులు నందలాల్, నారాయణ్ యాదవ్, నారాయణ్ భార్య రేఖ, వారి కుమారుడు అభయ్ ఉన్నారు. తాజాగా జరిగిన ఈ అవినీతి ఘటనతో.. ఎన్నికలలో అవినీతి నిజంగానే ఒక నిర్ణయాత్మక అంశంగా మారుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఓటు నోటు కుర్చీ!

  1. పాలకులు, నేతల అంతులేని దురాశ
  2. రాజకీయాల్లో అనివార్యమైన అవినీతి 
  3. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మధ్యప్రదేశ్  ముఖ్యమంత్రి ఉదంతం  
  4. సీఎం మోహన్‌యాదవ్, ఆయన కుటుంబంపై తీవ్ర అవినీతి ఆరోపణలు
  5. ఉజ్జయిని ప్రాంతాల్లో భారీగా భూములు కొనుగోలు
  6. పరిశోధనాత్మక  నివేదికలో వెల్లడి  

హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): ప్రజాస్వామ్యంలో రాజకీయాలు ప్రజా సంక్షేమం కోసం ఉండాలి. కానీ, నేడు అధికారం, ధనార్జన సమాంతరంగా నడుస్తున్నాయి. ఎన్నికల ఖర్చులు, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వేల కోట్ల రూపాయలు అవినీతి ద్వారానే వస్తున్నాయన్నది బహిరంగ రహస్యం.  రాజకీయాల్లో అవినీతి నిర్ణయాత్మక అంశంగా, అనివార్య భాగస్వామిగా మారిందనడంలో సందేహం లేదు.

మధ్యప్రదేశ్ ఉదంతమే అందుకు నిదర్శనం. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్‌యాదవ్ కుటుంబం ఉజ్జయిని పరిసర ప్రాంతాల్లో భారీగా భూములు కొనుగోలు చేసినట్లు ఒక పరిశోధనాత్మక నివేదిక వెల్లడించడం రాజకీయంగా కలకలం రేపింది. ఈ నివేదికలోని అంశాలపై ఒక ప్రముఖ శాటిలైట్ టీవీ ఛానల్‌లో ప్రసారమైన కథనం ప్రకారం.. మొహన్‌యాదవ్ 2023 డిసెంబర్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించారు.

నాటి నుంచి ఆయన ఉమ్మడి కుటుంబ సభ్యులు, వారి అనుబంధ రియల్ ఎస్టేట్ కంపెనీలు 168 ఎకరాల్లో 137 వరకు ప్లాట్లు కొనుగోలు చేశారు. వీటి విలువ సుమారు రూ.45 కోట్లు ఉంటుంది. కొత్తగా చేసిన కొనుగోళ్లు ఆ కుటుంబానికి ఇది వరకే ఉన్న ఆస్తులకు అదనం. అంటే.. డిసెంబర్ 2023 కంటే ముందు, మోహన్‌యాదవ్ కుటుంబానికి 100 కంటే ఎక్కువ ప్లాట్లలో సుమారు 180 ఎకరాల భూమి ఉన్నట్లు సమాచారం. ఈలెక్కన ప్రస్తుత రికార్డుల ప్రకారం వారి మొత్తం భూమి 300 నుంచి 335 ఎకరాలకు చేరింది.

కొత్తగా కొనుగోలు చేసిన ప్లాట్లలో చాలా వరకు ఉజ్జయిని మాస్టర్ ప్లాన్-2035 పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, జాతీయ రహదారుల విస్తరణ, భూ వినియోగ మార్పిడి (లాండ్-యూజ్ కన్వర్షన్) కోసం కేటాయించిన ప్రాంతాల్లోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2028 సింహస్థ కుంభమేళాకు సిద్ధమవుతున్న తరుణంలో ఉజ్జయినిలో పట్టణీకరణను వేగవంతం చేశారు. ఈ తరుణంలోనే పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడం వివాదాస్పదంగా మారి పలు అనుమానాలకు తావిస్తోంది. 

పరిశోధనాత్మక నివేదిక ప్రకారం.. లావాదేవీల వివరాలు

భూ రికార్డుల ప్రకారం.. ముఖ్యమంత్రియాదవ్ సతీమణి సీమాయాదవ్, కోడలు శాలినియాదవ్, సోదరులు నందలాల్, నారాయణ్‌యాదవ్, నారాయణ్ సతీమణి రేఖ, వారి కుమారుడు అభయ్‌తో పాటు సొంత బాబాయి/పెదనాన్న కుమారులు (కజిన్స్) గోవింద్,  నీలేష్ యాదవ్ కొనుగోలు జాబితాలో ఉన్నారు. ఈ కుటుంబానికి సంబంధం ఉన్న నాలుగు రియల్ ఎస్టేట్ సంస్థల ద్వారా లావాదేవీలు జరిగినట్లు సమాచారం.

సుమారు 111 ఎకరాల భూమిని ఉజ్జయిని--బద్నావర్, ఉజ్జయిని-- ఇండోర్ జాతీయ రహదారులకు సమీపంలో,  ప్రతిపాదిత రోడ్డు నెట్‌వర్క్‌లు, వ్యవసాయ భూములను నివాస, వాణిజ్య ప్రాంతాలుగా మార్చడానికి సిద్ధంగా ఉన్న జోన్లలో ఉండటం గమనార్హం.కొంతమంది కుటుంబ సభ్యులు బిల్డర్లతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఈ భూముల్లో హౌసింగ్ ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు.

వీటిలో మధ్యప్రదేశ్ రియల్ ఎస్టేట్  రెగ్యులేటరీ అథారిటీ (ఎంపీ రెరా) కింద నమోదైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. మౌలిక సదుపాయాల గురించిన ప్రభుత్వ ప్రకటనలు భూముల ధరలను విపరీతంగా పెంచాయని, ఇది పరోక్షంగా సీఎం కుటుంబానికి ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని విమర్శకులు వాదిస్తున్నారు. ఒక నిర్దిష్ట ప్రాంతంలో, సీఎం కజిన్ గోవింద్ యాదవ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు గంగేడి గ్రామంలోని హైవే జంక్షన్ల సమీపంలో 41 ఎకరాలకుపైగా భూమిని కొనుగోలు చేశారు.

రాజకీయ అవినీతి..- విస్తృత నేపథ్యం

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వివాదం.. అధికారిక కార్యాలయాలను కుటుంబ వ్యాపార ప్రయోజనాలకు దూరంగా ఉంచాలనే చర్చ జాతీయ స్థాయిలో మరోసారి తెరపైకి తీసుకొచ్చింది.  ఈ అంశాలు సుపరిపాలన, పారదర్శకతపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి పరీక్ష పెడుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి.

జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో (కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకతో సహా) ఆ పార్టీ నాయకులకు సంబంధమున్న అక్రమాలపై ఒక పరిశోధనాత్మక నివేదిక వెలుగులోకి వచ్చింది.  కిక్‌బ్యాక్‌లు, తక్కువ విలువకు రియల్ ఎస్టేట్ ఒప్పందాలు, క్రోనీ క్యాపిటలిజం (పక్షపాత ధోరణి) వంటి అంశాలను ఎత్తిచూపింది.  

సీఎంఓ సమర్థన

ముఖ్యమంత్రి కార్యాలయం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. డాక్టర్ మోహన్‌యాదవ్‌కు సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తూ, ముఖ్యమంత్రి గానీ, ఆయన భార్య సీమ, ఇతర కుటుంబ సభ్యులు గానీ పదవిలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఎలాంటి భూములు కొనుగోలు చేయలేదని తెలిపారు. యాదవ్ తన ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించినట్లుగా.. ఆయన సొంత వ్యవసాయ భూమి దాదాపు 17 ఎకరాలుగానే ఉంది, అందులో ఎలాంటి మార్పు లేదు.

ఉజ్జయినిలో ఈ కుటుంబానికి రియల్ ఎస్టేట్, భూ అభివృద్ధి రంగాలలో సుదీర్ఘ చరిత్ర ఉందని, 2023 కంటే ముందే అనేక ఆస్తులను కొనుగోలు చేశారని వారు పేర్కొన్నారు. ఆ కుటుంబానికి ఉన్న వ్యవసాయ భూమిలో ఎక్కువ భాగం 2008 మరియు 2019 మధ్యకాలంలోనే కొనుగోలు చేసినట్లు మద్దతుదారులు గుర్తు చేస్తున్నారు. ఈ లావాదేవీలన్నీ చట్టబద్ధమైన వ్యాపార కార్యకలాపాల ద్వారా, పారదర్శకంగా జరిగాయని చెబుతున్నారు.  

విపక్షాల తీవ్ర ఎదురుదాడి

కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై స్పందించింది. సీబీఐ, ఈడీ లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని డిమాండ్ చేసింది.  ఉజ్జయినిలోని ‘మహాకాలుడి భూములను’ దోచుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తోందని కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్ వంటి కాంగ్రెస్ ముఖ్యనాయకులు ఆరోపించారు. ప్రధాని నినాదమైన ‘నా ఖావుంగా, నా ఖానే దూంగా’ (నేను అవినీతికి పాల్పడను, ఇతరులను తిననివ్వను) అనే మాటను గుర్తు చేస్తూ ప్రభుత్వ నైతికతను ప్రశ్నించారు. కొందరు స్థానిక నివాసితులు, రైతు సంఘాలు కూడా అభివృద్ధి జోన్లలో తమపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశాయి.  

మధ్యప్రదేశ్ సీఎంకు అఖిలేష్ మద్దతు

ఉజ్జయిని భూ వివాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్‌యాదవ్‌కు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మద్దతుగా నిలిచారు. సీఎం కుటుంబం భారీగా భూములు కొనుగోలు చేసిందన్న ఆరోపణలను ‘బీజేపీ కుట్ర’ గా ఆయన అభివర్ణించారు. మోహన్‌యాదవ్‌ను అప్రతిష్ఠపాలు చేసి, అక్కడ నాయకత్వ మార్పును సులువుగా చేయాలనే ఉద్దేశంతోనే ఈ నివేదికలను రాజకీయంగా సృష్టించారని అఖిలేష్ ఆరోపించారు. 

ఈ ఆరోపణలు మోహన్‌యాదవ్‌పై వస్తే.. మరి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రే 300 నుండి 600 ఎకరాల భూమిని సేకరించారు. ఇందులో కొత్తేమీ లేదు. ఆయన గతంలో రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేశారు. ఈ విషయం బీజేపీకి తెలియదా? అని ప్రశ్నించారు.

మోహన్‌యాదవ్ కుటుంబం చాలా కాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉందని, ఈ భూ లావాదేవీలు ఆయన సీఎం కాకముందు నుంచే సాగుతున్న చట్టబద్ధమైన వ్యాపార కార్యకలాపాలే తప్ప అక్రమాలు కావని అఖిలేష్ అన్నారు. ఇతర నాయకుల ఉదాహరణలను ప్రస్తావిస్తూ.. ఇది నిజమైన అవినీతి కేసు కాదని, కేవలం ఒకరిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న రాజకీయ వ్యూహమని ఆయన కొట్టిపారేసే ప్రయత్నం చేశారు.