26 June, 2026 | 2:09 AM

గంట ఎక్కువ పనిచేయండి

26-06-2026 01:06 AM
  1. బకాయిలు వసూలు చేయండి.. అవి మీకే 
  2. మేమొచ్చాక ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు 
  3. పాలకులు ఐదేళ్లకోసారి మారుతారు.. ఉద్యోగులు మారరు 
  4. మీ విశ్వాసమే మా బలం.. నేను గుంపు మేస్త్రీనే 
  5. నన్ను రేవంతన్న అని పిలిస్తేనే ఇష్టం 
  6. ఢిల్లీకి వెళ్లేది రాష్ట్ర ప్రయోజనాల కోసమే: సీఎం రేవంత్‌రెడ్డి 
  7. ఉద్యోగులు, పెన్షనర్లు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ప్రమాద బీమాకు 16 బ్యాంకులతో ఎంవోయూ

* కొందరు నన్ను గుంపు మేస్త్రీ అని అవహేళన చేస్తున్నారు. ఎవరు ఏమన్నా నేను గుంపు మేస్త్రీనే. మూసీ ప్రక్షాళనకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే కాళ్లలో కట్టెపెడుతున్నారు. మెట్రోను విస్తరిస్తామంటే వద్దేవద్దు అంటున్నారు. మేము రూపొందిం చిన ప్రణాళికలన్నీ  కొలిక్కి వస్తున్నాయి. దేశంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఎదగాలంటే ఉద్యోగుల సహకారం అవసరం. ఉద్యోగులకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది. 

 ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): ‘తెలంగాణ ఉద్యోగులు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రతిరోజూ అదనంగా గంట పాటు ఎక్కువ పని చేయండి. ఆదాయం పెంచడంతో పాటు బకాయిలు వసూలు చేస్తే వాటిని ఉద్యోగుల కోసమే ఉపయోగిస్తాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే అది ఉద్యోగుల చేతుల్లోనే ఉందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు  ప్రమాదబీమా పథకానికి 16 బ్యాంకులతో గురువా రం రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, అధికారులు, ఉద్యోగ సంఘా లు, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మొదటగా సింగరేణి కార్మికులకు బీమా కల్పించేందుకు డిప్యూటీ సిఎం ప్రతిపాదించినప్పుడు తనకు నమ్మకం కలగలే దని, ఒక్క రూపాయి చెల్లించకుండా కోటి రూపాయల బీమా ఎలా సాధ్యం అనిపించిందన్నారు. కానీ ప్రమాదవశాత్తు మర ణించిన 45 మంది సింగరేణి కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల బీమా సొమ్మును వారికి అందించి ఇది సాధ్యమని నిరూపించారని తెలిపారు.

అందుకే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బీమా ను అమలు చేయాలని నిర్ణయించామని, బతికి ఉన్నప్పుడు ఉన్న బంధాలు చనిపోయిన తరువాత సానుభూతి మాత్రమే చూపుతాయన్నారు. ఆర్థికంగా ఆదుకునేవారు చాలా తక్కువ అని, అందుకే ఈ ప్రమాదబీమా ఉద్యోగుల కుటుంబానికి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాను ఇస్తుందన్నారు. ఉద్యోగుల భద్రత యజమానిదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మీకు యజమాని సీఎం చెప్పారు.

‘కొందరు నన్ను గుంపు మేస్త్రీ అని అవహేళన చేస్తుంటారు. ఎవరు ఎలా మాట్లాడినా.. నేను గుంపు మేస్త్రీ నే.. ఈ గుంపంతా నాదే.. ఈ గుంపే నా బలం.. ఈ గుంపే నా ప్రతిష్ఠ.. ఈ గుంపే పేదలకు ప్రభుత్వానికి మధ్య వారధులు’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తాము దొరలం.. మాకు గడీలు ఉన్నాయని కొందరిలా తాను గొప్పలు చెప్పుకోనన్నారు.

తన హోదా, పదవి మారినా తాను మీకు ఎప్పటికీ రేవంతన్ననే అన్నారు. మన మధ్య ఉన్నది అన్నదమ్ముల అనుబంధమేనని, మీ సోదరుడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడని పేర్కొన్నారు. మనందరం కలిసి తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. ఐదేళ్లకోసారి పాలకులు మారినా ఉద్యోగులు మాత్రం శాశ్వతంగా ఉంటారన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులే వారధులు, సారథులన్నారు. 

పదేళ్లలో వందేళ్ల విధ్వంసం

ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను.. కేసీఆర్ పదేళ్లలో రూ.8 లక్షల 11  వేలకోట్లు అప్పులు చేసి దివాళా తీయించారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. 11.5 శాతం మిత్తితో అప్పులు చేశారని, దానికి తాను 7.5 శాతానికి తీసుకొచ్చానని పేర్కొన్నారు.  పదేళ్లలో వందేళ్ల విధ్వంసం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు మొదటి తారీఖున జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండే దా ఆలోచన చేయాలని ఉద్యోగులను కోరారు. చెప్పిన మాట ప్రకారం విడతల వారీగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిధులు విడుదల చేస్తున్నా మని, రానున్న రోజుల్లో వాటిని ఇంకా పెంచుతామన్నారు.

మీకు సమస్యలుంటే మా దృష్టికి తీసుకురావాలని, చర్చించుకుని పరిష్కరించుకుందామని సూచించారు. ప్రజలకు విజయవం తంగా అందించే ప్రతీ సంక్షేమ పథకం అమలులో మీ ఉద్యోగుల కృషి ఉందన్నారు. ‘మీ నమ్మకమే మా బలం’ అని, రోజుకో గంట ఎక్కు వ పనిచేసి... రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచాలని కోరారు. పెంచిన ఆదాయాన్ని మీ అవసరా లను తీర్చడానికి ఉపయోగిస్తామని చెప్పారు. నిర్ణయాలు మేం తీసుకున్నా అది అమలు చేసేది ఉద్యోగులేఅన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే అది ప్రభుత్వ ఉద్యోగుల చేతుల్లోనే ఉందన్నారు. 

కాళ్లలో కట్టె పెడుతున్నారు

మూసీ ప్రక్షాళన చేయాలని తాము ప్రయత్నిస్తుంటే కాళ్లలో కట్టెపెడుతున్నారని, మెట్రోను విస్తరిస్తామంటే వద్దేవద్దు అంటున్నారని సీఎం విమర్శించారు. గంగా, కావేరి, కృష్ణ వంటి నదు ల పేర్లను ఆడబిడ్డలకు పెడుతున్నామని, కానీ మూసీ నది పేరు ఎందుకు పెట్టుకోవడంలేదని ఎప్పుడైనా ఆలోచన చేశారా? అని ప్రశ్నించారు. మూసీ అంటేనే కాలుష్యానికి మారుపేరుగా మారిందని, దానిని ప్రక్షాళన చేస్తుంటే అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.

ఆనాడు తాము అభివృద్ధి చేయాలని పోరాడితే.. ఇప్పుడు వాళ్లు వద్దే వద్దు అని ధర్నాలు చేస్తున్నారని పేర్కొన్నా రు. ఓట్లు వేయని ప్రజలు ఉంటే ఏంటి లేకుంటే ఏంటి అని ఊరిమీద పడి తిరుగుతున్నారని, ముగ్గురు గద్దలా అడ్డుపడుతున్నారని కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి విమర్శించారు. ఫామ్ హౌస్‌లో ఉంటే కుంభకర్ణుడు.. బయటికి వస్తే బకాసురుడు అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నాడని తెలిపారు.  పామ్‌హౌస్‌లో ఉన్నవాళ్లకు మూసీ, మెట్రోతో పనిలేదేమో.. కానీ, పేదలకు అవసరమన్నారు. ఫామ్‌హౌస్‌లో ఉన్నవాళ్లు సొంతంగా విమానంలో విదేశాలకు వెళ్తారని విమర్శించారు.

తెలంగాణ కోసం సర్వం కోల్పోయినవారికి తాము పదవులు ఇస్తుంటే ఏవీ చేయొద్దని తమకు అడ్డు పడుతున్నారన్నారు. పేపర్ మూల్యాంకనంలో గ్లోబరీనా సంస్థవల్ల నాడు ఇంటర్మీడియట్ విద్యార్థులు 25 మంది చనిపోయారని మాట్లాడిన వారిని జైళ్లలో పెట్టారని, అదే గ్లోబరీనా సంస్థ నీట్ పరీక్ష పేరుతో లక్షలాది మంది జీవితాలతో చెలగాటమాడిందని, గత పాలకులు ఆనాడే చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.  ఇలా ప్రతిదానికి అడ్డుపడితే చింతబరిగె ఇరుగుతుందని సీఎం హెచ్చరించారు. రాష్ట్రంలో 70 వేల ఉద్యోగాలిచ్చామని గుర్తు చేశారు. 

ప్రణాళికలన్నీ కొలిక్కి వస్తున్నాయి

30 నెలలుగా ఒక్క రోజు కూడా తాను సెల వు తీసుకోలేదని సీఎం చెప్పారు. తామ రూపొందించిన ప్రణాళికలన్నీ ఇపుడు ఒక కొలిక్కి వస్తున్నాయని, ఢిల్లీలో ఏముంది ? కాలుష్యం.. ట్రాఫిక్ జామ్ తప్ప.. రాష్ట్ర ప్రయోజనాల కోస మే కదా తానేను  పదే పదే ఢిల్లీ వెళ్లేదన్నాను. ఉద్యోగుల సమస్యలు తీర్చాలన్న ఆలోచనే తప్ప మాకు వేరే ఆలోచన లేదన్నారు.

తన రాజకీయ ప్రయాణంలో బాధ్యత పెరిగింది తప్ప.. నా నడక, నడత, జీవిన విధానంలో ఎలాంటి మార్పు రాలేదని స్పష్టం చేశారు. తనను సీఎం, సార్ పిలవడం కంటే కూడా రేవంతన్న అని పిలిస్తేనే ఇష్టపడతాన్నారు. అక్రమార్కులను కట్టడి చేస్తే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని, అది మీ కోసమే ఖర్చు చేస్తాన్నారు. అయితే తాను కోరేది ఒక్కటేనని, రోజుకు గంట ఎక్కువ పని చేయాలని ఉద్యోగులను సీఎం విజ్ఞప్తి చేశారు. 

మార్పు తీసుకొద్దాం

తెలంగాణలో మార్పు తీసుకొద్దామని, తనకు రెండో సారి సీఎం అయ్యే అవకాశం వచ్చేందుకు మీరే వారధులని, కాంగ్రెస్ మరోసారి గెలిస్తే అది కూడా ఉద్యోగుల వల్లే అని తాను నమ్ముతున్నానని ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దుదామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడి పెట్టుబడులను ఆకర్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్‌గా ఎదగాలంటే మీ అందరి సహకారం అవసరమన్నారు. 

త్వరలోనే హెల్త్ కార్డులు : భట్టి

ఉద్యోగులకు త్వరలోనే క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు జారీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం కోసం దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా సరికొత్త ఉచిత బీమా పథకాన్ని తీసుకొచ్చామని, ఈ పథకం ద్వారా అటు ప్రభుత్వంపై కానీ, ఇటు ఉద్యోగులపై కానీ ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడకుండా, బ్యాంకులతో మాట్లాడి భారీ బీమా రక్షణను కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఈ బీమా పథకం ద్వారా సాధారణ ప్రమాదాల్లో మరణిస్తే రూ. కోటి 25 లక్షలు, అదే విమాన ప్రమాదం జరిగితే రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు బీమా పరిహారం అందుతుందని వివరించారు. అలాగే 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల ఉద్యోగులకు రూ. 10 లక్షల జీవిత బీమా రక్షణ ఉంటుందన్నారు. ప్రమాదవశాత్తు శాశ్వత సంపూర్ణ వైకల్యం లేదా పాక వైకల్యం సంభవించినా ఈ పథకం ద్వారా ఉద్యోగులకు ఆర్థిక అండ లభిస్తుందన్నారు.

కేవలం రెగ్యులర్ ఉద్యోగులకే కాకుండా.. నెలనెలా ప్రభుత్వ రికార్డుల ద్వారా జీతం పొందే కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో కోరుతున్న హెల్త్ కార్డు సమస్యకు ప్రజా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఒక ప్రత్యేక ’ట్రస్ట్’ ద్వారా ఉద్యోగులందరికీ పూర్తి స్థాయిలో ’క్యాష్‌లెస్’ (నగదు రహిత) వైద్య సేవలు అందించేలా క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని, దీనివల్ల ఆరోగ్య భద్రత మరింత మెరుగవుతుందని భరోసా ఇచ్చారు.

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన మిగతా సమస్యలను కూడా పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లకు ఆర్థిక భద్రత కల్పించేలా వివిధ బ్యాంకులతో  ఒప్పందాలు కుదుర్చుకోవడంతో తెలంగాణ ఎంప్లాయీస్, గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్ అండ్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) హర్షం వ్యక్తం చేసింది.

సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సాహం నింపిందని టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు పేర్కొన్నారు. 14 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల కుటుంబాలకు ఇది గొప్ప భరోసా అని, ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలను తెలిపారు.