సీఈసీ చట్ట ఉల్లంఘన

26-09-2026 | 05:05am
  1. ఏకపక్షంగా జ్ఞానేష్‌కుమార్ వ్యహారం
  2. తోటి కమిషనర్లకు తెలియకుండా నిర్ణయాలు
  3. పూర్తికమిషన్ ముసుగులో రహస్యంగా ఆదేశాలు
  4. సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్
  5. సీఈసీ జెన్‌జీతో ఓటర్ సదస్సుల వాయిదా

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) దేశంలో పెనుప్రకంపనలు సృష్టిస్తోంది. భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్(సీఈసీ) జ్ఞానేష్‌కుమార్(CEC Gyanesh Kumar) తీరు.. రాజకీయ తుఫాన్‌కు తెరలేపింది. తోటి ఇద్దరి కమిషనర్ల ఆమోదం లేకుండా పూర్తికమిషన్ ముసుగులో రహస్యంగా బహిరంగ ఆదేశాలు జారీచేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమా ర్ తీసుకున్న నిర్ణయాలు, మార్గదర్శకాలు, సాఫ్ట్‌వేర్ మార్పులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది.

ఇటువంటి చర్యలు సామూహిక నిర్ణయం తీసుకోవాలనే చట్టబద్ధమైన నిబంధనను ఉల్లంఘిస్తున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయవాది చంద్ ఖురేషి ద్వారా న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో, పూర్తి ఎన్నికల సంఘం ఆమోదం లేకుండా లేదా ఎన్నికల సంఘం మెజారిటీ అభిప్రాయానికి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలను రాజ్యాంగ విరుద్ధంగా, సీఈసీ అధికార పరిధికి మించినవిగా, చెల్లనివిగా ప్రకటించాలని కోరారు. అవసరమైన ఆమోదం లేకుండా తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేయడంతో పాటు, అధికార దుర్వినియోగం కింద సీఈ సీ, ఇతర అధికారులపై క్రిమినల్ చర్యలు ప్రారంభించాలని కూడా పిటిషనర్ విన్నవించారు.

ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్ (ఈసీ) పేరుతో తీసుకున్నట్లు ఆరోపించబడిన అనేక నిర్ణయాలపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి లిఖిత పూర్వక అభ్యంతరాలు నమోదు చేశారని ఒక నివేదిక వెల్లడించిన కొద్ది రోజులకే ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల చట్టం, 2023లోని నిబంధనలను, ముఖ్యంగా సెక్షన్ 18ను ఆధారంగా చేసుకున్నారు. సర్ అనేక నిర్ణయాలు, మిగిలిన ఇద్దరు కమిషనర్ల అభ్యంతరాలను లెక్కచేయకుండా సీఈసీ తీసుకున్నారని లేదా అమలు చేశారని పిటిషన్‌లో ఆరోపించారు.

ఓటర్లుగా నమోదు చేసుకునే ఫారం 6లో మార్పులు చేయడం లేవనెత్తిన ప్రధాన సమస్యలలో ఒకటి. పూర్తి కమిషన్ ఏకాభిప్రా యం లేకుండా లేదా ఎన్నికల కమిషనర్ల మెజారిటీ అభిప్రాయానికి విరుద్ధంగా సీఈసీ ఆధ్వర్యంలో ప్రారంభించిన, ఆమోదించిన లేదా  అమలు చేసిన అన్ని నిర్ణయా లు, మార్గదర్శకాలు, ఆదేశాలు, సాఫ్ట్వేర్ మార్పులు రాజ్యాంగ విరుద్ధమైనవన్నారు. ఈ విషయంలో మాండమస్ రిట్ లేదా మరేదైనా తగిన రిట్, ఉత్తర్వు లేదా ఆదేశం జారీ చేయాలని కోరారు. 

సీఈసీకి ఓటింగ్ లేదా వీటో పవర్ లేదు

గోవా, పశ్చిమ బెంగాల్లలో ఓటర్ల జాబితా సవరణల నిర్వహణపై కూడా ఈ పిటిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమ బెంగాల్‌లో, న్యాయాధికారులచే పేర్లు పునరుద్ధరించబడిన ఓటర్లకు వ్యతిరేకంగా, ఈసీ పేరుతో 16.10 లక్షలకు పైగా అప్పీళ్లు దాఖలయ్యాయని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ అప్పీళ్ల గురించి మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్లకు, పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారికి తెలియదని తెలిపారు. అంతేకాదు వారు వీటికి అధికారం ఇవ్వలేదని ఆరోపించారు.

ఈసీ ఐటీ విభాగానికి పరిపాలనా బాధ్యతల కేటాయింపునకు సంబంధించిన జూలై 28 నాటి ఉత్తర్వును కూడా ఈ పిటిషన్ సవాలు చేస్తోంది. బహుళ-సభ్యుల ఈసీలో సీఈసీ ‘సమానులలో ప్రథముడు’ అని, ఇతర కమిషనర్లపై ఆయనకు ఉన్నతమైన ఓటింగ్ లేదా వీటో అధికారం లేదని వాదించారు. అక్టోబర్ 1, 2025 నుంచి ఈసీ ఓటర్ల జాబితా నిర్వహణ వ్యవస్థలకు సంబంధించిన సర్వర్ లాగ్‌లు, డేటాబేస్‌లు, కమ్యూనికేషన్లు, మెటాడేటాను భద్రపరచాలని ఈ పిటిషన్ కోరింది. ఈ ఆరోపణలపై స్వతంత్ర న్యాయ విచారణ జరపాలని తెలిపింది. 

సీఈసీ.. జెన్‌జీ ఈవెంట్స్ వాయిదా!

సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌కు సంబంధించిన ముఖ్య కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీఈసీ రాజీ నామా చేయాలని సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే ఆల్టిమేటం జారీ చేశారు.

మరిన్ని వార్తలు