31 August, 2026 | 4:23 PM

అలంపూర్ అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక దృష్టి

31-08-2026 03:22 PM

జోగులాంబ రైల్వే స్టేషన్ పనులు 95 శాతం పూర్తి.. త్వరలో ప్రారంభం

పెండింగ్‌ పనులను వేగంగా పూర్తి చేయాలి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

అలంపూర్, ఆగస్టు 31: జోగులాంబ శక్తిపీఠం అభివృద్ధితో పాటు ఆలంపూర్ ప్రాంత మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. సోమవారం అలంపూర్‌లోని జోగులాంబ రైల్వే స్టేషన్‌ను మంత్రి పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు.అమృత్ భారత్ పథకంలో భాగంగా రూ.6.07 కోట్లతో చేపడుతున్న రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు దాదాపు 95 శాతం పూర్తయ్యాయని కిషన్‌రెడ్డి వెల్లడించారు.మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి, ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా స్టేషన్‌ను

ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జోగులాంబ శక్తిపీఠం విశిష్టత, ఆధ్యాత్మికత ప్రతిబింబించేలా స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.జోగులాంబ ఆలయ అభివృద్ధికి కేంద్ర పర్యాటక శాఖ ద్వారా ఇప్పటికే రూ.37 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఆలంపూర్‌లో బస్‌స్టాండ్, బ్రిడ్జి, రోడ్లు తదితర పెండింగ్‌ పనులను రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు. భక్తులు, పర్యాటకుల రాకను దృష్టిలో పెట్టుకుని రహదారులు, పార్కింగ్, తాగునీరు, పారిశుధ్యం, రవాణా వసతులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు.తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని, రాష్ట్రంలోని 42 రైల్వే స్టేషన్లను

ఆధునికీకరిస్తున్నామని, 2027 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. రైల్వే నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ సింగిల్ లైన్లను డబుల్, డబుల్ లైన్లను ట్రిపుల్ లైన్లుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, ఆలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు, దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ డీఆర్‌ఎం సంతోష్ కుమార్ వర్మ, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.