31 August, 2026 | 5:48 PM

Breaking News

నిషేధిత జాబితా నుంచి రైతుల భూములను తొలగించాలి

31-08-2026 03:14 PM

ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించిన సర్పంచ్‌ మర్రి సంధ్య మల్లారెడ్డి

అశ్వాపురం, ఆగస్టు 31(విజయక్రాంతి): మండలంలోని నెల్లిపాక రెవెన్యూ పరిధిలో నిషేధిత జాబితాలో చేర్చిన రైతుల భూములను వెంటనే ఆ జాబితా నుంచి తొలగించాలని నెల్లిపాక సర్పంచ్‌ మర్రి సంధ్య మల్లారెడ్డి కోరారు.  సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో రైతుల తరఫున అధికారులకు వినతిపత్రం సమర్పించారు. నెల్లిపాక రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 190, 433, 450, 997తో పాటు మరికొన్ని సర్వే నంబర్లలోని భూములను నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత జాబితాలో చేర్చినట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు.

దీంతో ఆయా భూములను రైతులు విక్రయించడం, కొనుగోలు చేయడం సాధ్యం కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా సన్నకారు, చిన్నకారు రైతులు తమ కుటుంబ అవసరాలకు భూమిని వినియోగించుకోలేకపోతున్నారని, కుటుంబాల్లో వివాహాలు జరిగినా వారసులకు భూములను బదలాయించలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు భూముల వివరాలను సమగ్రంగా పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా ఉన్న భూములను నిషేధిత జాబితా నుంచి తక్షణమే తొలగించాలని సర్పంచ్‌ మర్రి సంధ్య మల్లారెడ్డి కోరారు