31 August, 2026 | 4:18 PM

పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

31-08-2026 03:04 PM

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ వైస్ చైర్మన్ డాక్టర్ అనిత, బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలో వీధిలైట్లు, దోమలు, వీధి కుక్కల సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ వలి మాట్లాడుతూ కౌన్సిల్ పదవీకాలం ప్రారంభమై ఎనిమిది నెలలు గడుస్తున్నా మున్సిపాలిటీ పాలన సక్రమంగా సాగడం లేదని విమర్శించారు.

సమస్యల పరిష్కారానికి తీర్మానం కావాలని అధికారులు చెబుతున్నారని, అయితే బీఆర్‌ఎస్ కౌన్సిలర్లంతా రెండు నెలల క్రితమే తీర్మానం చేసి ఇచ్చినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని అన్నారు.వైస్ చైర్మన్ డాక్టర్ అనిత మాట్లాడుతూ పలు కాలనీల్లో దోమలు, కుక్కల బెడద తీవ్రంగా ఉందన్నారు. ప్రతి కౌన్సిల్ సమావేశంలో సమస్యలను ప్రస్తావిస్తున్నా అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు.

ప్రతి కాలనీలో ఫాగింగ్ నిర్వహించాలని తీర్మానం చేసినప్పటికీ అది కాగితాలకే పరిమితమైందని విమర్శించారు.పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.