కార్యకర్తకు అండగా చంద్రబాబు
ప్రమాదంలో గాయపడిన నాగేశ్వరరావుకు పరామర్శ
ఆరోగ్యం కుదుటపడాలని ఆకాంక్ష.. ఆర్థికంగా అండగా ఉంటామని భరోసా
ముద్రగడ వంశీని అభినందించిన టీడీపీ అధినేత
తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని కోరిన ముద్రగడ వంశీ
ఇల్లందు టౌన్, సెప్టెంబర్ 4, (విజయక్రాంతి): ఇల్లందు టౌన్ 1వ వార్డుకు చెందిన టీడీపీ కార్యకర్త బాసాని నాగేశ్వరరావును ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతి సచివాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పరామర్శించారు. నాలుగు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావును తొలుత ఫోన్‌లో పరామర్శించిన చంద్రబాబు, ఆరోగ్యం కుదుటపడిన అనంతరం తన వద్దకు తీసుకురావాలని ముద్రగడ వంశీని ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ముద్రగడ వంశీ ఆధ్వర్యంలో నాగేశ్వరరావును కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబును కలిశారు.
ఈ సందర్భంగా నాగేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకుని, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని, ఆర్థిక సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. నాగేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పార్టీ దృష్టికి తీసుకెళ్లి, బాధ్యతగా పర్యవేక్షించిన ముద్రగడ వంశీని చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ చాందావత్ రమేష్‌బాబు, విద్యార్థి సంఘ నాయకుడు దాసరి గోపాలకృష్ణ, కామేపల్లి సర్పంచ్ అజ్మీర బుజ్జిని చంద్రబాబు అభినందించారు.
పార్టీలో కష్టపడి పనిచేస్తే తప్పకుండా అవకాశాలు లభిస్తాయని, ప్రజలకు బాధ్యతగా భావించి ఎల్లప్పుడూ ప్రజాక్షేత్రంలో ఉంటూ పనిచేయాలని సూచించారు. అనంతరం ముద్రగడ వంశీ మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తను ప్రత్యేకంగా పరామర్శించి ధైర్యం చెప్పిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో టీడీపీని మరింత బలోపేతం చేసే దిశగా దృష్టి సారించాలని చంద్రబాబును కోరగా, రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు కారు నర్సన్న, దాసరి గోపాలకృష్ణ, గోగేలా రాజేష్, బాసాని సుజాత, బాసాని నవీన్, బాసాని సాయి, తమానబోయిన భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.






