4 September, 2026 | 7:14 AM

మేఘారెడ్డిది పైచేయి..?

04-09-2026 | 05:50am

చిన్నారెడ్డి పదవి రద్దుతో వనపర్తి రాజకీయాల్లో కొత్త మలుపు

వనపర్తి, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి ): వనపర్తి కాంగ్రెస్లో కొద్దిరోజులుగా కొనసాగుతున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షలు చిన్నారెడ్డి వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మేఘారెడ్డి (Wanaparthy Constituency MLA Megha Reddy) రాజకీయ పోరుకు తాజా పరిణామాలు కీలక మలుపు తిప్పాయి. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి డా. జి. చిన్నారెడ్డిని తొలగిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో వనపర్తి నియోజకవర్గ రాజకీయాల్లో మళ్లీ చర్చ మొదలైంది.  

గోపాల్‌పేటతో మొదలైన వివాదం

గోపాల్పేటలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై చిన్నారెడ్డి చేసిన ఆరోపణలతో ఇరువురి మధ్య విభేదాలు బహిరంగంగా బయటపడ్డాయి. టికెట్ వ్యవహారం, నియోజక వర్గంలో రాజకీయ ఆధిపత్యం వంటి అంశాలపై మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. మేఘారెడ్డి ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించి, వాటిని నిరూపించాలని సవాల్ విసిరిన సంగతి అందరికి తెలిసిందే. 

అధిష్ఠానం గడప వరకు

ఈ వివాదాన్ని ఎమ్మెల్యే మేఘారెడ్డి పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదులు చేయడంతో వ్యవహారం రాష్ట్రస్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు వెళ్లిన సందర్బం కూడా అందరికి తెలిసిందే . 

చివరకు పదవి రద్దు

తాజాగా చిన్నారెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం వెలువడింది. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ క్రమశిక్షణ వివాదానికి దారితీసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుందని రాజకీయ వర్గాలు విశ్లేషస్తున్నారు. 

మేఘారెడ్డిది పైచేయి అన్న చర్చ

ఈ పరిణామాలన్నింటినీ వరుసగా పరిశీలిస్తే, వనపర్తి కాంగ్రెస్లో ప్రస్తుతానికి ఎమ్మెల్యే మేఘారెడ్డి రాజకీయంగా పైచేయి సాధించినట్లుగా చర్చ జోరుగా జరుగుతోంది. బహిరంగ ఆరోపణల నుంచి అధిష్ఠానం దృష్టికి ఫిర్యాదు చేయడం వరకు మేఘారెడ్డి తీసుకున్న రాజకీయ అడుగులు ఇప్పుడు ఫలించినట్లుగా ఆయన వర్గం భావిస్తోంది. అయితే, నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న చిన్నారెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని ఒక పదవి రద్దుతో ముగిసిన అధ్యాయంగా చూడలేమన్న అభిప్రాయం కూడా ప్రజల చర్చలో బలంగా వినిపిస్తుంది .

ఆయన తదుపరి రాజకీయ అడుగు ఏమిటి? తన వర్గాన్ని ఎలా ముందుకు నడిపిస్తారు? అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. మొత్తానికి.. ఎవరిదీ పైచేయి? అన్న ప్రశ్నకు తాజా పరిణామాలు తాత్కాలికంగా మేఘారెడ్డి వైపు సమాధానం చూపిస్తున్నప్పటికీ, వనపర్తి కాంగ్రెస్లో ఆధిపత్య పోరు పూర్తిగా ముగిసిందా? లేక కొత్త రాజకీయ సమీకరణాలకు నాంది పలికిందా? అన్నది రానున్న రోజుల్లో తేలనుందని వనపర్తి ప్రజలు చర్చించుకుంటున్నారు.