‘శతలేఖినీసురత్రాణ’ బిరుదాంకితుడు చరిగొండ ధర్మన్న
“పదముల చొప్పును వడి యొ
ప్పిదము నలంకారలక్ష్మి పేర్మియు ధారా
స్పద భావముల గల్గి శుభ
ప్రదమై హయమవురె సత్ప్రబంధము రీతిన్”
అంటూ గుర్రపు నడకను ప్రబంధపు తీరుతో పోల్చి చెప్పిన కవి చరిగొండ ధర్మన. ఇదొక విచిత్రమైన పోలిక. దీనిని చెప్పిన పద్యం ధర్మన రచించిన ‘చిత్ర భారతము’ అనే ఎనిమిది ఆశ్వాసాలున్న అద్భుత కావ్యం లోనిది.
కవిత్వం గజ్జెల గుర్రంలా ఉండాలని చెప్పిన ఈ పద్యంలోని భావం వలెనే ఆయన రచన కూడా విశేష కల్పనలు, గొప్ప ధారాశుద్ధి, అపురూప పదబంధాలతో శుభప్రదంగా ఉం ది. పైగా, తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్న కావ్యంగానూ ఇది కీర్తిని పొందింది.
ఒకానొక విచిత్రమైన గతిలో రసవంతంగా రచించిన చరిగొండ ధర్మన్న మహబూబ్‌నగర్ జిల్లాలో ‘చరిగొండ సీమ’గా ప్రసిద్ధి చెందిన ప్రాం తంలోని చరిగొండ గ్రామంలో జన్మించాడు. తదనంతర కాలంలో నాటి కరీంనగర్ జిల్లాలోని నృసిం హ క్షేత్రమైన ధర్మపురిలో స్థిర నివాసం ఏర్పరచుకుని, ఆ స్వామికి పరమభక్తుడై ఈ కావ్య రచనను అక్కడే చేసినట్లు పలువురు సాహితీవేత్తలు అనేక ప్రమాణాలతో నిర్ధారించారు.
విశేష కల్పనల సమాహారం
తెలంగాణ ప్రాంతం నుండి వెలువడిన విశేష ప్రబంధాలలో ఈ ‘చిత్ర భారతము’ ప్రధానమైంది. సాహిత్యకారుల గుర్తింపు పొందిన ఈ కల్పిత ప్రబంధం అనేక మహాభారత కథలకు విశేష కల్పనలు జోడించి రచించాడు. ధర్మన్న తన ఈ కావ్యా న్ని నరసింహస్వామి భక్తుడైన ఎనుములపల్లి పెద్దనామాత్యునికి అంకితం చేశాడు.
ఈ పెద్దనామా త్యుడు నాటి ఓరుగల్లు పాలకుడైన చిత్తాపుఖానుని మంత్రిగా ఉండేవాడు. ఈ చిత్తాపుఖానుని ‘సీతాపతిరాజు’ అనే పేరు కలిగిన హిందూరాజుగా చరిత్ర కారులు అనేక చారిత్రక ఆధారాలతో నిర్ణయించారు. ఇతడు క్రీ.శ. 1480 నుంచి 1485 ప్రాంతం లో రాచకొండకు కూడా ఏలికగా ఉన్నట్టు తెలుస్తున్నది.
ప్రజారంజకుడుగా కీర్తిని పొందిన రాజు ఈ చిత్తాపుఖానుడు. ఆయన క్రీ.శ. 1503లో నాటి గోల్కొండ పాలకుడైన కుతుబ్ ఉల్ ముల్క్‌ను జయించి, వరంగల్లులో తన కేతనాన్ని ఎగురవేశాడు. ఆయన వరంగల్లులోని అనేక చారిత్రక కట్టడాలను, ఆలయాలను పునరుద్ధరించిన సమర్థపాలకుడు. తర్వాత 1512లో కులీకుతుబ్ షా అత నిని ఓడించినట్లు, పిమ్మట ఆయన గజపతులను ఆశ్రయించినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు.
‘చిత్ర భారతము’ కథ విచిత్రమే
ఈ చిత్తాపుఖానుని మంత్రి అయిన ఎనుములపల్లి పెద్దనామాత్యుడు ధర్మన కావ్యాన్ని అంకితం పొందిన కృతిభర్త. ధర్మన్న కాలం 1503 తర్వాత అని సాహిత్య చరిత్రకారులు భావించారు. ‘చిత్ర భారతము’ ఒక విచిత్ర కథతోకూడిన గొప్ప కల్పిత ప్రబంధం.
ఇందులోని కథ పూర్తిగా కల్పితం. పాత్ర లు మాత్రం మహాభారతానికి సంబంధించినవే అయినా, వాటిని ఆధారంగా చేసుకుని నూతన కథా కల్పన చేశాడు. ఈ ‘చిత్ర భారత’ ప్రబంధ రచన చేసేనాటికి ధర్మన్న అవధాన ప్రక్రియలో ఎంతో నిష్ణాతుడుగా పేరొందాడు.
ఈ కృత్యవతారికలో కృతి స్వీకర్త పెద్దనామాత్యుడు ధర్మన్నను శ్లాఘిస్తూ
“శతలేఖిన్యవధాన పద్యరచనా
సంధాసురత్రాణ చి
హ్నితనామా! చరిగొండ
ధర్మ సుకవీ!
నీ వాగ్విలాసంబు లా
శితి కంఠోజ్జల జూటకోటర
కుటీ శీతాంశు రేఖా సుధా
న్విత గంగా కనకాబ్జ నిర్భర రసావిర్భూత మాధుర్యముల్”
అన్నాడు. ఈ మాటలే ధర్మన్న ప్రతిభకు తార్కాణాలు. ధర్మన్న రచనా పారీణత్వానికీ, ఆ రచనలోని విశేషాలను తెలుసుకోవడానికీ, అం దులోని కవిత్వ తత్తశక్తిని అర్థం చేసుకోవడానికీ ఈ పద్యమే సరిపోతుంది. ఈ మార్గంలో ‘చిత్ర భారతా న్ని’ అధ్యయనం చేస్తే ధర్మన్న ప్రతిభ మనకు బోధ పడుతుంది.
కృష్ణార్జునుల యుద్ధానికి బీజం
చరిగొండ ధర్మన్న రచించిన ‘చిత్ర భారతం’ ఎంతో ఆశ్చర్యకరమైన కథతోకూడిన కావ్యం. కథా నిర్మాణమే విచిత్రం. నిజానికిది చిన్నకథే అయినా ఆసక్తికరమైన వర్ణనలు, అనేక ఉపకథలతో పెంచి, ఎనిమిది ఆశ్వాసాల ప్రబంధంగా కవి దీనిని రచించడం విశేషం. కథ ఎత్తుకోవడానికే దాదాపు ప్రథ మాశ్వాసమంతా సరిపోయింది.
కథా మూలంగా చెప్పుకునే కృష్ణార్జునుల యుద్ధానికి కారణభూతుడైన చతుర్ధన మహారాజు మూడో ఆశ్వాసంలో ప్రవేశిస్తాడు. అరణ్యంలో తపోనిష్ఠలో మునిగిన తుల్యుడనే ముని పుంగవుని గురించి చెప్పిన కవి ఆ సందర్భంలో విస్తృతంగా ఋతువర్ణనలు చేశా డు.
ఆ మునీశ్వరుడు ఏయే ఋతువులో ఎటువంటి కఠోర తపస్సు చేశాడో వర్ణించి ఆ భాగాలను విస్తారంగా పెంచాడు. ఆ ముని తపోభంగం నిమి త్తం స్వర్లోకాధిపతి అయిన దేవేంద్రుడు పంపగా దేవవేశ్య రంభ రావడం, ఆమెతోపాటు మన్మథుడు రావడం, మళ్లీ ఈ సందర్భంలో కవి ప్రత్యేకంగా వసంత ఋతువును వర్ణించడం కారణంగా గ్రంథ విస్తృతి పెరిగింది.
ఇక్కడ విపులమైన రీతిలో కథా విస్తృతి చేశాడు కవి. రంభ ఆ ముని తపస్సును భంగం చేసే నిమిత్తం వీణ వాయించడం, ఆ వీణా వాదనకు ఆయన కళ్లు తెరవడం, దాంతో ఆమె భ్రమకు లోనై అనేక శృంగార విషయాలను మునితో సంభాషించడం, ఆగ్రహించిన మునీశ్వరుడు రంభను ‘ఆడగుఱ్ఱం కమ్మని’ శపించడం, దానికి భీతిల్లిన ఆమె వేడుకున్నాక మన్నించి శాప విమోచనం చెప్పడం, చతుర్ధన మహారాజును తనపై సకల లోకాలు తిప్పడంతో ఆమెకు శాప విమోచనం కలగడం జరుగుతాయి.
ఇక్కడ కృష్ణార్జున యుద్ధానికి బీజం వేశాడు కవి. రంభ ఆడగుఱ్ఱమై చతుర్ధనుని తనపై లోకాలు తిప్పుతున్న సందర్భంలో ఆ అశ్వం నోటినుంచి నురగ వచ్చి కింద అర్ఘ్య ప్రదానం చేస్తున్న శ్రీకృష్ణుని చేతిలో పడడం, శ్రీకృష్ణుని ప్రతిజ్ఞ, చతుర్ధనుడు భయంతో అర్జునుని శరణు వేడటం, దానివల్ల శ్రీ కృష్ణార్జున యుద్ధం సంభవించడం..
ఈ విధంగా కథ సాగిపోయింది. ఇందులోనే రాయబారాలు, వాదోపవాదాలు, దూషణ భూషణలు వంటి అనేకాంశాలను కవి అత్యంత ప్రతిభావంతంగా, అద్భుతంగా రచించాడు. కావ్యాన్ని రసవంతం చేసి తెలుగు సాహితీ ప్రపంచానికి అందించాడు.
సంపూర్ణ ప్రబంధ లక్షణాలు
రచించిన ప్రతి పద్యాన్నీ రసవంతం చేసి ధర్మన్న కవిత్వప్రియులకు పరమ ఆహ్లాదాన్ని కలిగించాడు. ఆయన రచించిన ఈ ప్రబంధంలోని లక్షణాలను ఎందరో సాహిత్యవేత్తలు పలు సందర్భాల్లో చర్చించారు. ప్రబంధ యుగం వచ్చే నాటికి తిక్కనాది కవుల నుంచి వికసించడం ప్రారంభించిన ప్రబంధ లక్షణాలు చరిగొండ ధర్మన్న కాలానికి ఒక ప్రత్యేక రూపాన్ని సంతరించుకున్నాయి.
ఇందుకు సంపూర్ణ ప్రబంధ లక్షణాలతోకూడిన ధర్మన్న రచనే ప్రత్యక్ష ఉదాహరణ. తదనంతర కవులకు, ముఖ్యంగా ప్రబంధ కవులకు ఈ కావ్యం ఒక ఆదర్శ ప్రబంధం గా నిలిచిందనవచ్చు. అష్టాదశ వర్ణనలు, వస్వైక్యత వంటి లక్షణాలేగాక మరెన్నో విశేషాలు ఈ కావ్యం లో చోటు చేసుకున్నాయి. అంతేగాక, సంవాద శైలిలో కథాగమనం సాగడం వల్ల ఇందులో నాటకీయత చోటు చేసుకున్నది.
రాజనీతి వర్ణన తోపాటు ఇతరేతర రసాత్మకత కోసం మరింత ప్రయత్నం చేశాడు చరిగొండ కవి. దాదాపుగా ప్రతి పద్యంలోనూ ఏదో ఒక చమత్కారాన్ని కూడా నిబద్ధించడం ధర్మన్న ప్రత్యేకతగా కనిపిస్తున్నది. భవి ష్యత్తులో విజయ విలాసకర్త ‘ప్రతి పద్య రచనా చమత్కృతికి’ దీనిని భూమికగా భావించవచ్చు. ఈ ప్రబంధం కేవలం ఏకనాయకంగా కాక అనేక ఉపకథలతో కూడిన పటిష్ఠ ప్రబంధంగా నిలిచింది. తదనంతర కాలపు కవులకు ఆదర్శంగానూ మారింది.
కల్పిత కథాకావ్యాలకు ఒజ్జబంతి
తెలుగులో వచ్చిన పలు కల్పిత కథా కావ్యాలకు ‘చిత్ర భారతము’ ఒజ్జబంతి వంటిది. ఒక విధంగా నంది తిమ్మన ‘పారిజాతాపహరణాని’కి, పింగళి సూరన ‘కళా పూర్ణోదయాని’కి, కనుపర్తి అబ్బయామాత్యుని ‘అనిరుద్ధ చరిత్ర’కు, చిలకమర్తి లక్ష్మీనర సింహం ‘గయోపాఖ్యాన’ నాటకానికి ఇంకా మరె న్నో ఈ తరహా రచనలకు ఈ ప్రబంధ కావ్యం స్ఫూర్తిగా నిలిచి వెలుగొందింది.
తెలుగు సాహిత్యం లో శిఖరాయమానులైన మహాకవులకన్నా పూర్వ మే చరిగొండ ధర్మన్న కొత్త మార్గాలు వేసి పెట్టాడు. “ఆంధ్ర కవితా పితామహుడైన అల్లసాని పెద్దనకు ముందే వేటను సవిస్తరంగా వర్ణించిన కవి ధర్మన్న” అన్న ఆరుద్ర మాటలు చరిగొండ ధర్మన్న ప్రతిభను తెలియజేస్తున్నాయి. నంది తిమ్మనకంటే ముందే ‘పారిజాతాపహరణం’ కథ ఇందులో సూచితమైం ది.
దేవేంద్రునితో 26 గద్య పద్యాల్లో ఈ కథను చెప్పించడం విశేషం. నారదుడు పారిజాత పుష్పా న్ని తెచ్చి రుక్మిణీ దేవికి ఇవ్వడం, సత్యభామ అలక, కృష్ణుడిని కాలితో తన్నడం వంటి సన్నివేశాలన్నీ ఈ 26 పద్య గద్యాల్లో ఉన్నాయి. ఏడుస్తున్న సత్యభామను ఊరడిస్తూ, శ్రీకృష్ణుడు
“ఏమిటి కింతవంత తరళేక్షణ!
చెప్పుమటన్న, లేచి య
బ్భామిని చన్నుదోయిపయి పయ్యెదకొంగు దలంగి జార
నెమ్మో మరవాల్చి యూరుపుల ముంగర ముత్యము గంద నేడి చెం
గోమల నూతన స్వరము గ్రోలుచు
గోయిల పిల్లయో యనన్”
అంటూ చెప్పిన పద్యం నంది తిమ్మన ‘పారిజాతాపహరణ’ కావ్యానికి పూర్వరూపంగా కనిపిస్తున్న ది. అంతేగాక, ఇంద్రుని దేవేరి శచీదేవి సత్యభామ ను మాటలతో అవమానించడం, పిదప సత్యభామ ఇంటికి వెళ్లి చింతిస్తున్న సన్నివేశాన్ని వర్ణిస్తూ
“ఈసును గోపమున్మది వహించి
పులోమజ వేడిమాటకై
గాసిలి మేనసొమ్ముడిపి కన్నుల గ్రమ్మెడు
నీట జందనం
బోసరింపగ జేసి శిరమొయ్యన వంచి
కపోలపాళిపై
జేసయ కొల్పి యొక్కయెడ జింతిలుచుండెడు నంత లోపలన్”
చెప్పిన పద్యం పాఠకుని కళ్లెదుట దుఃఖితురాలైన సత్యభామ రూపాన్ని సాక్షాత్కరింపజేస్తున్నది. మానవ సంవేదనల్లో దుఃఖానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దుఃఖం మనిషి మనసుపైనేగాక బాహ్యరూపంపైనా ప్రభావం చూపిస్తుంది. అయినవాళ్లు అవమానిస్తే వచ్చే దుఃఖం మరింత క్రుంగదీస్తుంది.
ఆ సందర్భాన్నే ఎదుర్కొన్న సత్యభామ రూపాన్ని కవి వర్ణించిన తీరు ఆయన ప్రతిభకు నిదర్శనం. లోకం తీరును కవి వర్ణించిన విధానమూ ఈ పద్యంలో కనిపిస్తుంది. దుఃఖం కేవలం సత్యభామదే కావచ్చు కాని, దుఃఖితమతులైన ప్రతి వ్యక్తి స్థితినీ ఇది ధ్వనింపజేస్తున్నది.
గంటకు నూరు పద్యాలు చెప్పగల మహావధాని
‘శతలేఖినీ సురత్రాణుని’గా భూషితుడైన కవి చరిగొండ ధర్మన్నను గురించి చెప్పిన మాటలోని ‘సురత్రాణ’ శబ్దం ‘సుల్తాన్’ అనే అన్యదేశానికి సంస్కృతీకరణమేనని పండితులు పేర్కొన్నారు. గంటకు నూరు పద్యాలు అలవోకగా చెప్పగలిగిన ఈ కవి తొట్ట తొలిసారి ‘అవధాన’ శబ్దాన్ని ప్రయోగించినట్లు సాహితీ విమర్శకులు నిర్ధారించారు.
ఇంతటి కీర్తిమూర్తి అయిన ధర్మన్నను గురించి ఆరుద్ర తమ ‘సమగ్రాంధ్ర సాహిత్యం’లోని ప్రస్తావన ఈ సందర్భంగా గమనార్హం. “తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే సాహిత్య కల్పనలను కొంచెం ముందుగానే ఊహించిన చరిగొండ ధర్మన వంటి కవులను మన సాహిత్య చరిత్రకారులు పట్టించుకోలేదు” అన్న ఆయన మాటలు యదార్థాలే.
గన్నమరాజు గిరిజా మనోహరబాబు
9949013448






