చేయూతనిద్దాం!
వారి భవితకు
చేదోడు వాదోడుగా
మునుముందుకు నడిపిద్దాం
అగ్గిపెట్టెలో చీరను
మడత పెట్టగల
వారి నైపుణ్యానికి విలువనిద్దాం
ఘనతకు మారుపేరుగా
ప్రపంచపటంలో నిలుపుదాం
ఆ చేతుల అల్లికలోని
మెళకువలకు
పట్టాభిషేకం చేద్దాం
చీర అంచుల్లో విధవిధాల
సొబగులకు
ఒక గుర్తింపును కలిగిద్దాం
విరబూసిన పూలమాలల్లా
కలబోసిన నేత అల్లికల్లో
వినూత్నతకు
గులాములమవుదాం
చిత్రవర్ణాల శోభితమైన
వస్త్రాలలో
వన్నెతకు శిరసావహిస్తూ
ఆదరిద్దాం
నాటి విలువలు నేటి స్థితిలో
కనుమరుగవుతున్న తరుణాన
మనసు వ్యాకులతకు
దర్పణమైంది
నేటి హంగుల పొంగులతో
షాపింగ్ మాల్స్‌ల రంగులతో
నేత బతుకు నీరు గారుతుంటే
మనసు కన్నీరొలికింది
స్వదేశీ సాంప్రదాయపు వస్త్రాలు
విదేశీ నవ్యతలో
నలిగిపోతుంటే
అటకెక్కిన చేనేతను చూసి
హృదయం ద్రవించింది
మరమగ్గాల రాకతో చేనేతల
చేతి బిగువు సన్నబడింది
నేతన్నల బతుకు
బరువై పోయింది
ఒకే వృత్తి అలవాటుగా
చేసుకున్నాక
నూతనత్వపు ఉరవడిలో
చేనేతల చేతి మగ్గం
చతికిల పడింది
నేడు అప్పులఊబిలో
కూరుకుపోతూ
కన్నీటి పర్యంతమై పోయింది
ఆత్మహత్యలే చివరి పేజీగా
ఎటూ కదలక ఆగిపోయింది!
కోనేటి నరేష్






